నా పరువుకు భంగం కలిగిస్తున్నారు
● కోర్టులో పళణి వాదన ● విచారణకు హాజరు
సాక్షి, చైన్నె: తన పరువుకు భంగం కలిగించే విధంగా ఆధార రహిత ఆరోపణలు చేస్తున్నారని కోర్టులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి తన తరపున వాదనను ఉంచారు. అరప్పోర్ ఇయక్కంపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణ నిమిత్తం మంగళవారం కోర్టుకు పళణి హాజరయ్యారు. వివరాలు.. 2016–21 కాలంలో రహదారుల శాఖలో రూ. 692 కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నట్టు అరప్పోర్ ఇయక్కం ఆరోపించింది. శివగంగై, కోయంబత్తూరులలో రహదారుల పనులలో ఈ అక్రమాలు జరిగినట్టు ఆ శాఖను తన పరిధిలో ఉంచుకున్న అప్పటి సీఎం, ప్రస్తుత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామిపై ఆ ఇయక్కం ఆరోపణలు చేయడంతో వివాదం రచ్చకెక్కింది. తనపై ఆధార రహిత ఆరోపణలు చేసిన అరప్పోర్ ఇయక్కం కన్వీనర్ జయరాం వెంకటేషన్, కో కన్వీనర్ జాకీర్ హుస్సేన్‌పై పళణి స్వామి పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కల్గించే విధంగా వ్యవహరించిన వారిపై రూ.1.10 కోట్లకు ఈ దావా వేశారు. ఈ పిటిషన్ మద్రాసు హైకోర్టు ఆవరణలోని మాస్టర్ కోర్టులో విచారణలో ఉంది. ఈ విచారణ నిమిత్తం ఉదయం స్వయంగా కోర్టుకు పళణి స్వామి హాజరయ్యారు. ఆయన తరపున న్యాయవాది ఇన్బదురై వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మహాలక్ష్మి ఎదుట తన తరపు వాదనను పళణిస్వామి ఉంచారు. ఆధార రహిత ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అరప్పోర్ ఇయక్కంం తప్పుడు ప్రచారం చేస్తున్నదని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాదన అనంతరం తదుపరి విచారణను డిసెంబరు 11వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment