బీజేపీలో సంస్థాగత సమరం
సాక్షి, చైన్నె: రాష్ట్ర బీజేపీలో సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. వార్డు కమిటీలకు తొలుత ఎన్నికలను నిర్వహించేందుకు మంగళవారం చర్యలు తీసుకున్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా జరిగిన విషయం తెలిసిందే. ఆశించిన మేరకు సభ్యత్వ నమోదు ముందుకు సాగలేదు. కోటి సభ్యులను చేరుస్తామని నేతలు ప్రకటించినా, ఆచరణలో విఫలమయ్యారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను ముగించిన రాష్ట్ర నేతలు సంస్థాగత ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టారు. పార్టీ సీనియర్ నేత చక్రవర్తి నేతృత్వంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలైంది. తొలుత పార్టీ పరంగా ఉన్న 68,144 వార్డు శాఖలకు 30వ తేదిలోపు సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు నిర్ణయించారు. ఒక్కో శాఖలో ఓ అధ్యక్షుడు, 11 మంది సభ్యులను ఎంపిక చేయనున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు తప్పనిసరిగా ఉండే విధంగా ఆదేశాలు ఇచ్చారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ గురించి చక్రవర్తి పేర్కొంటూ, రాష్ట్రంలో 68 వేల వార్డు కమిటీ శాఖలు ఉన్నాయని, వీటికి తొలుత సంస్థాగత ఎన్నికలను ముగించి తర్వాత 1231 మండలాలు, పార్టీ పరంగా ఉన్న 66 జిల్లాలకు ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ సభ్యుల సంఖ్య 40 లక్షలకు చేరినట్టు ప్రకటించారు. సభ్యత్వ నమోదులో ఉన్న కొన్ని చిక్కులను తొలగించే విధంగా పార్టీ అధిష్టానం ఈనెల 22వ తేదీన నిర్వహించనున్న సమావేశంలో విజ్ఞప్తి చేయనున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment