సంగ్రామానికి సంసిద్ధం
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లే విధంగా ప్రచార భేరి మోగించాలని కేడర్‌కు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు బుధవారం డీఎంకే ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపుతో 7వ సారిగా తమిళనాడు డీఎంకే పాలనను తీసుకొచ్చేందుకు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ప్రజా క్షేత్రంలోకి ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాలను దరిచేర్చే విధంగా, ప్రాజెక్టుల తీరు తెన్నులను సమీక్షించి వేగవంతం చేసే విధంగా సమీక్షలలో ఆదేశాలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే డీఎంకేలో సమన్వయ కమిటీని రంగంలోకి దించి రాష్ట్రవ్యాప్తంగా కేడర్, నేతల అభిప్రాయాలను స్వీకరించారు. ప్రభుత్వ పరంగా ఓ వైపు, పార్టీ పరంగా మరో వైపు కార్యక్రమాలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఉన్నత స్థాయి కమిటీతో బుధవారం డీఎంకే ప్రధాన కార్యాలయంలో స్టాలిన్ సమావేశమయ్యారు. పార్టీ సీనియర్‌లు దురై మురుగన్, టీఆర్ బాలు, కేఎన్ నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, ఏవీ వేలు, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, కనిమొళి, ఉదయనిఽధి స్టాలిన్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రజలలోకి చొచ్చుకు వెళ్లే కార్యక్రమాలు చేపట్టడం చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సారి 200 స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే తమిళనాడులో తమకు ఆరుసార్లు అధికారం కట్టబెట్టిన ప్రజలు, 7వ సారి సైతం కట్టబెట్టే విధంగా, వారి మన్ననలు పొందే కార్యక్రమాల మీద దృష్టి పెట్టే విధంగా తీర్మానాలు చేశారు.
తీర్మానాలలో కొన్ని ..
2026 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతూ, ఇప్పటి నుంచే ప్రచార భేరి మోగించాలని నిర్ణయించారు. జిల్లా, నగర, యూనియన్, పురపాలక స్థాయిలో కార్యక్రమాలను పార్టీ పరంగా విస్తృతం చేయడమే కాకుండా, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులను ప్రజలలోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ప్రచార భేరి మోగించాలని ఆదేశించారు. వజ్రోత్సవాల వేళ డీఎంకే కార్యక్రమాలు విస్తృతం కావాలని సూచించారు. అంకిత భావంతో సీఎం స్టాలిన్ ప్రజల కోసం చేస్తున్న మంచి పనులు, సంక్షేమాలను వివరించే విధంగా సభలు, సమావేశాలు విస్తృతం కావాలని, ఇంటింటా ప్రభుత్వ ప్రగతి గురించి సమగ్ర సమాచారం చేరవేసే రీతిలో నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడులోని ప్రతి డీఎంకే సోదరుడు ఓ సైన్యం అని చాటే విధంగా ప్రచార కార్యక్రమాలలో దూసుకెళ్లాలని తీర్మానించారు. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీ పాలకు తీరును ఖండిస్తూ తీర్మానం చేశారు. హిందీని బలవంతంగా రుద్దే విధంగా సాగుతున్న ప్రయత్నాలను ఖండించారు. శ్రీలంక చెరలో ఉన్న తమిళ జాలర్లను విడుదల చేయించాలని పట్టుబడుతూ తీర్మానం చేశారు. మణిపూర్ మండుతోండటంపై విచారం వ్యక్తం చేస్తూ, ఇప్పటికై నా ప్రధాని నరేంద్ర మోదీ ఆరాష్ట్రంలో పర్యటించాలని , అన్ని వర్గాల ప్రజల భద్రతకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పన్నువాటాలో రాష్ట్రానికి కేంద్రం 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని నినాదిస్తూ ప్రత్యేక తీర్మానం చేశారు.
ప్రచార భేరి మోగించండి
ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో డీఎంకే శ్రేణులకు స్టాలిన్ పిలుపు
కేంద్రం విధానాలపై ఫైర్
Comments
Please login to add a commentAdd a comment