ఆర్డీఓ కార్యాలయం ముట్టడి
తిరువళ్లూరు: గుమ్మిడిపూండి సమీపం ఈగువారిపాళ్యం కొండమేదర కులాలకు చెందిన కుటుంబాలకు ఎస్టీ సర్టిఫికెట్ మంజూరు చేయాలని పొన్నేరి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. తిరువల్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలుకా ఈగువారిపాళ్యం పంచాయతీలోని కొంగల్‌మేడు గ్రామంలో 30 సంవత్సరాల నుంచి మలైకురవన్(కొండమేదర) కులాలకు చెందిన కుటుంబాలు నివాసం వుంటున్నాయి. వెదురు బుట్టలు అల్లి వాటిని విక్రయించడమే వీరి ప్రధాన జీవనాధారం. వీరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అయితే ఉన్నత చదువులకు వెళ్లాడానికి కులధ్రువీకరణ సర్టిఫికెట్‌లు అవసరం వుంది. అయితే కులధ్రువీకరణ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. కాగా ఇదే కులానికి చెందిన ఆత్తుపాక్కం గ్రామస్తులకు ఇటీవల ఎస్టీ సర్టిఫికెట్‌లను సబ్‌కలెక్టర్ వాఘేసంఘత్ బల్వంత్ మంజూరు చేశారు. అయితే ఈగువారిపాళ్యం పంచాయతీలోని వారికి మాత్రం మంజూరు చేయలేదు. దీంతో బుధవారం ఉదయం పొన్నేరి ఆర్డీఓ కార్యాలయం వద్ద బుట్టలి అల్లి బాధితులు తమ కుటుంబసభ్యులతో కలసి ఆందోళనకు దిగారు. విషయం తెలిసి పొన్నేరి సబ్‌కలెక్టర్ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. సర్టిఫికెట్‌ల కోసం ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్నారని వారి నుంచి నివేదిక రాగానే సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సంఘం నేతలు తమిళరసు, ఏవీ షణ్ముగం, గంగాదురై, విజయన్, శేకర్, మదన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment