రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన
తిరువళ్లూరు: రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన సాగుతోందని హిందూ ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అర్జున్‌సంపత్ ఆరోపించారు. తిరువళ్లూరు జిల్లా పూంగానగర్‌లో హిందూ ప్రజాపార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం, పార్టీ జెండాను ఎగురవేసే కార్యక్రమం బుధవారం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అర్జున్‌సంపత్ మాట్లాడారు. రాష్ట్రంలో మోజారిటీగా వున్న హిందువులు మైనారిటీలకు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టియన్‌లు అయిన ఉదయనిధి, సినీనటుడు జోసెఫ్ విజయ్ ఇద్దరిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయడానికి రాష్ట్రంలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇందుకోసం డీఎంకే–తమిళగ వెట్రి కళగం మధ్య రహస్య ఒప్పందం కూడా జరిగిందని ఆరోపించారు. అవినీతి రహిత పాలనను అందించాలని తాము ప్రయత్నం చేస్తుంటే అధికార దాహం కోసం డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రాజకీయాన్ని వ్యాపారం చేస్తూ ఒప్పందాలను తెరపైకి తెస్తున్నారని వాపోయారు. 2026లో బీజేపీ నేతృత్వంలోని పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆయన, హిందువుల పరిరక్షణకు తమ వైపు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం సమావేశం అనంతరం ఇటీవల పుల్లరంబాక్కం గ్రామంలో కూల్చివేసిన కృష్ణుడి ఆలయాన్ని సందర్శిఽంచడానికి ఆయన బయలుదేరారు. అయితే ఇందుకు పోలీసులు ససేమిరా అంటూ అడ్డుకున్నారు. దీంతో అర్జున్‌సంపత్ పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో పుల్లరంబాక్కం గ్రామానికి చెందిన మహిళలు, కృష్ణుడి వేషధారణలో వున్న చిన్నారులు అర్జున్‌సంపత్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమ గ్రామంలోని ఆలయాన్ని కూల్చకుండా కాపాడాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment