రామేశ్వరం విలవిల
● పది గంటల్లో 41 సెం.మీ వర్షం ● డెల్టాలో దెబ్బతిన్న 40 వేల ఎకరాల సంబా పంట ● అన్నదాతల గగ్గోలు ● 26, 27 తేదీలలో అతి భారీ వర్షాలకు అవకాశం
జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వర్షపు నీరు, నాగపట్నంలో నీటి తొలగింపు పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ ఆకాశ్
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో అనేక జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రామేశ్వరంలో పది గంటలలో 41 సెం.మీ వర్షం పడడంతో అక్కడి ప్రజల జీవనం స్తంభించింది. డెల్టా జిల్లాలలో కురుస్తున్న వర్షాలకు సంబా వరి పంట మీద ప్రభావం పడింది. 40 వేల ఎకరాల పంట దెబ్బతిన్నట్లు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. ఈశాన్య రుతు పవనాలు విస్తరించడంతో దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి, తేని, రామనాథపురం జిల్లాలో కొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు శుక్రవారం కూడా కొనసాగనున్నాయి. రామనాథపురం జిల్లా వ్యాప్తంగా 12 గంటల పాటు నిర్విరామంగా భారీ వర్షం పడింది. ఇందులో రామేశ్వరంలో ఏక దాటిగా 10 గంటల పాటుగా 41 సెం.మీ వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాలలో 16 నుంచి 20 సె.మీ వర్షం పడింది. దీంతో ఈ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రామేశ్వరం రామనాథ స్వామి ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. కెరటాలు ఎగసి పడతుండడంతో జాలర్ల తమ పడవలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రామేశ్వరం, పాంబన్, మండపం మార్గాలో రోడ్లమీద వరదలు పొటెత్తాయి. సాగరం ముందుకు చొచ్చుకు వచ్చినట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి లోతట్టు ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అనేక చోట్ల చెట్లు నేలకు వంగడంతో వాటిని తొలగిస్తున్నారు. ఈదురు గాలులతో వర్షం ఇక్కడ కొనసాగుతోంది. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులో అలల తాకిడి అధికంగా ఉండడంతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద భక్తులను సముద్రం వైపుగా అనుమతించడం లేదు. ఇద్దరు మహిళలకు అలల తాకిడిలో కాళ్లు విరగడంతో అప్రమత్తమయ్యారు. తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్‌కాశిలలో కురుస్తున్న వర్షాలకు తామర భరణి, మంజలారు. మణిముత్తారు నదులలోకి నీటి రాక పెరగడంతో తీర వాసులను అప్రమత్తం చేశారు. ఈ జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు.
డెల్టా జిల్లాల్లో..
గత మూడు రోజులుగా డెల్టా జిల్లాలైన నాగపట్నం, మైలాడుతురై, తంజావూరు, పుదుకోట్టై, తిరువారూర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కొనసాగుతుండడంతో పంట పొలాలలోకి నీళ్లు చేరాయి. సంబా వరి పంట మీద ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పంట పొలాలలో నీరు చేరడంతో డెల్టా జిల్లాలలో సుమారు 40 వేల ఎకరాలలో వరి పంట దెబ్బ తిన్నట్టు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వర్షాలు కొనసాగుతుండడంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అదే సమయంలో ఇక్కడి అన్నదాతలు తమ పంటలకు బీమా చేసుకునే వెసులు బాటు కల్పిస్తూ అవకాశాన్ని ఈనెల 30వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. శివగంగై జిల్లాలోని మాన మదురై, తిరుపత్తూరు, శింగంపునరి, కారైక్కాడి, దేవకోట్టై,ఇలంయాకుడి పరిసరాలు వర్షం కొనసాగుతోంది. నాగపట్నంలో ఈదురు గాలలు ప్రభావం మరీ ఎక్కువగా ఉండటంతో జాలర్లు గురువారం కూడా చేపల వేటకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఉపరితల ఆవర్తనం..
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది బలపడి అల్పపీడన ద్రోణిగా ఒకటి రెండు రోజులలో మారనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 26, 27 తేదీలలో అనేక జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేసింది. దక్షిణ తమిళనాడుతో పాటు డెల్టా జిల్లాలో వర్షాలు కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరింతగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయా జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment