విమానంలో సాంకేతిక లోపం
● చైన్నెలో ల్యాండింగ్
సేలం: చైన్నె నుంచి మలేషియాకు బయలుదేరి వెళ్లిన మలేషియా ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానం సాంకేతిక లోపం తలెత్తడంతో మళ్లీ చైన్నెలో ల్యాండ్ అయ్యింది. చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్‌కు వెళ్లాల్సిన మలేషియన్ ఎయిర్‌లైన్స్ 134 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మొత్తం 146 మందితో గురువారం బయలుదేరింది. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడినట్టు పైలట్లు గుర్తించారు. వెంటనే ఆ విషయాన్ని చైన్నె విమానాశ్రయానికి సమాచారం ఇచ్చి, వారి సూచన మేరకు చైన్నెలో ల్యాండ్ చేశారు. అనంతరం గంటల పాటు ప్రయత్నించినా సాంకేతిక లోపం సరికాకపోవడంతో విమానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం అందులో వెళ్లాల్సిన ప్రయాణికులలో 80 మంది మాత్రం మరో విమానంలో గురువారం రాత్రి కౌలాలంపూర్‌కు పంపించారు. మిగిలిన ప్రయాణికులకు చైన్నెలోని పలు హోటళ్లలో బస కల్పించారు. ఈ క్రమంలో శుక్రవారం మళ్లీ మలేషియాకు వెళ్లే ఎయిర్‌లైన్స్ విమానంలో మిగిలిన 54 మంది ప్రయాణికులను పంపించారు. కాగా సాంకేతికలోపం సరైన సమయంలో గుర్తించడంతో అందులో ఉన్న 146 మంది అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు.
ఏసీబీకి కోర్టు నోటీసులు
సాక్షి, చైన్నె: మంత్రి పెరియస్వామి దాఖలు చేసిన పిటిషన్‌కు వివరణ ఇవ్వాలని ఏసీబీకి ప్రత్యేక కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 2008లో డీఎంకే హయాంలో అప్పటి ఐపీఎస్ అధికారి జాఫర్ షేట్ సతీమణి పర్విన్‌తో పాటు పలువురికి తిరువాన్మియూరులో గృహ నిర్మాణ స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అప్పట్లో గృహ నిర్మాణ శాఖకు మంత్రిగా ఐ.పెరియస్వామి ఉండే వారు. ఆ తదుపరి అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి స్థల కేటాయింపులో అక్రమాలు జరిగినట్టుగా పేర్కొంటూ ఏసీబీని రంగంలోకి దించింది. పెరియ స్వామి, జాఫర్ షేట్, పర్విన్, మురుగయ్య, రాజమాణిక్యం, ఆర్.దుర్గాశంకర్‌లపై 2013లో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈకేసు నుంచి ఒక్క పెరియస్వామి మినహా తక్కిన వారందరిని విడుదల చేశారు. ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారించే కోర్టులో ఈ వ్యవహారం ఉంది. ప్రస్తుతం డీఎంకే కేబినెట్‌లో పెరియస్వామి మంత్రిగా ఉన్నారు. ఈ స్థల వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులు, ఉత్తర్వులను గుర్తుచేస్తూ తనపై దాఖలైన కేసును రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. వివరణ ఇవ్వాలని ఏసీబీకి కోర్టు నోటీసులను జారీ చేసింది.
అధికార మార్పు తథ్యం
● కుష్బూ వ్యాఖ్య
సాక్షి, చైన్నె: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాల వ్యూహాలతో తమిళనాడులో అధికార మార్పు తథ్యం అని బీజేపీ జాతీయ కమిటీ సభ్యురాలు, సినీ నటి కుష్బూ అన్నారు. శుక్రవారం స్థానికంగా ఆమె మాట్లాడుతూ దేశాన్ని ఎవరు పాలిస్తే మంచిదో, ఎవరు మంచి చేస్తారా ప్రజలు చక్కగానే అవగాహన కలిగి ఉన్నారన్నారు. అందుకే ప్రధానిగా మోదీని ఎన్నుకుంటూ వస్తున్నారన్నారు. కేవలం గెలుపు లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరన్నారు. వారి ప్రయత్నాలు, నిర్ణయాలన్నీ దేశంలో సమస్యలు సృష్టించేందుకు కారణం అవుతున్నాయని ఆరోపించారు. మణిపూర్ వ్యవహారంలో పీఎంను విమర్శిస్తున్నారని, అయితే, ఇక్కడ సమస్యకు కారణంగా కాంగ్రెస్ హయాంలో పి.చిదంబరం తీసుకున్న నిర్ణయాలేనని పేర్కొంటూ, ఇదే విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు సైతం గుర్తు చేస్తున్నాయని విమర్శించారు. మణిపూర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. మహారాష్ట్ర, జార్కండ్ ఎన్నికలలో బీజేపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. 2026లో తమిళనాడులో జరిగే ఎన్నికలలో కూటమి విషయంగా అధిష్టానం పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా పన్నే వ్యూహాలతో తమిళనాడులో అధికార మార్పు తథ్యమని వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఇప్పుడే రాజకీయ పార్టీ ప్రకటించారని, డీఎంకేకు వ్యతిరేకంగా ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకుని ఉన్నట్టుందన్నారు. ఈ వ్యతిరేక వ్యూహాలు ఏమిటో విజయ్‌ను అడిగి తెలుసుకోవాలని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
చైన్నెకి రామేశ్వరం జాలర్లు
కొరుక్కుపేట: శ్రీలంక జైలులో బందీలుగా ఉన్న ఐదుగురు రామేశ్వరం జాలర్లు చైన్నెకు చేరుకున్నారు. తమిళనాడులోని రామేశ్వరం పుదుకోట్టైకి చెందిన జాలర్లు అక్టోబర్ 9న తెల్లవారుజామున సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లారు. శ్రీలంక నౌకాదళంకు చెందిన పెట్రోలింగ్ బోటు అక్కడికి వచ్చి తమిళనాడు మత్స్యకారులను పట్టుకుంది. బోటు, వలలను స్వాధీనం చేసుకుని శ్రీలంకకు తరలించారు. తర్వాత శ్రీలంక కోర్టులో హాజరుపరిచి, జైల్లో పెట్టారు. ముఖ్యమంత్రి స్టాలిన్, భారత విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపి మత్స్యకారులను, వారి పడవలను విడిపించేందుకు చర్య లు తీసుకోవాలని అత్యవసర లేఖ రాశారు. దీంతో శ్రీలంక జైలు నుంచి విడుదలైన పుదుకోట్టై, రామేశ్వరానికి చెందిన ఐదుగురు జాలర్లు విమానంలో చైన్నె చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment