బాధ్యతల స్వీకరణ
తిరువల్లూరు: వెంగత్తూరు పంచాయతీ అధ్యక్షురాలిగా సునిత శుక్రవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ వెంగత్తూరు పంచాయతీ అధ్యక్షురాలిగా సునిత పోటీ చేసి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. అయితే నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై ఆమె పదవిని కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ జనవరి నెలలో రద్దు చేశారు. ఈమె స్థానంలో ఉపాధ్యక్షుడిగా వున్న మోహనసుందరానికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే నిధుల దుర్వినియోగం చేయకపోయినా తమను పదవి నుంచి తప్పించారని ఆరోపిస్తూ కోర్టును సునిత ఆశ్రయించారు. 11 నెలల పాటు సాగిన విచారణ ముగిసి సునితకు అనుకూలంగా తీర్పును న్యాయమూర్తి వెలువరించారు. వెంగత్తూరు పంచాయతీ అధ్యక్షురాలిగా సునితకు 8 వారాల్లోపు బాధ్యతలు అప్పగించాలని కోర్టు తీర్పులో వెలువరించారు. కోర్టు ఉత్తర్వులను గురువారం కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్‌కు సునిత అందించారు. ఇందులోభాగంగానే శుక్రవారం సునిత పదవిని పునరుద్దరిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో కడంబత్తూరు బీడీఓ మణిశేఖర్ ఆమెకు బాధ్యతలు అప్పగించారు.
పంట పొలంలో మొసలి
సేలం: చైన్నె సమీపంలో ఊరపాక్కం అరుంగాల్ గ్రామంలోకి చొరబడిన మొసలిని అటవీ శాఖ అధికారులు పట్టుకుని వండలూరు జూకు తరలించారు. చెంగల్పట్టు జిల్లా పెరుంగలత్తూ ర్ సమీపంలోని నెడుంకుండ్రం, ఆలపాక్కం, ఊరపాక్కం సమీపంలో ఉన్న గ్రామాల్లోని చెరువుల్లో మొసళ్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈక్రమంలో వర్షాకాలంలో చెరువులు నిండిన సమయంలో మొసళ్లు చెరువుల్లో నుంచి రోడ్లపైకి వస్తున్నాయి. ఈక్రమంలో శుక్ర వారం వండలూరు సమీపంలోని అరుంగాల్ గ్రామంలో పంట పొల్లాలో 5 అడుగుల మొసలి కనిపించింది. దీంతో భయాందోళన చెందిన ప్రజలు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గంట పాటు పోరాడి మొసలిని పట్టుకుని వండలూరు జూకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment