బంగారాలకు బ్రహ్మరథం
సాక్షి, చైన్నె: అమెరికా వేదికగా బంగారు పతకాలను కై వసం చేసుకున్న తమిళనాడుకు చెందిన క్యారమ్స్ క్రీడాకారిణులకు బ్రహ్మరథం పట్టే విధంగా విమానాశ్రయంలో ఆహ్వానం లభించింది. వీరిని డిప్యూటీ సీఎం, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ అభినందించారు. అమెరికాలో జరిగిన ప్రపంచ స్థాయి క్యారమ్స్ పోటీల్లో తమిళనాడు నుంచి ముగ్గురు క్రీడాకారిణులు వెళ్లి తమ సత్తాను చాటే విషయం తెలిసిందే. ఇందులో ఉత్తర చైన్నెలో న్యూ వాషర్‌మెన్ పేట షెరియన్ నగర్ రెండవ వీధికి చెందిన మెహబూబ్‌బాషా కుమార్తె కాశీమా ప్రపంచ చాంపియన్‌గా మూడు బంగారు పతకాలను దక్కించుకున్నారు. అలాగే, చైన్నె వ్యాసార్పాడికి చెందిన నాగజ్యోతి, మదురైకు చెందిన మిత్రా బంగారు పతకాలు సాధించారు. అమెరికా పయనానికి ఆర్థిక భారం అడ్డు వచ్చిన సమయంలో తమను రాష్ట్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించి ఆదుకోవడంతో ఈ ముగ్గురు బంగారు పతకాలతో చైన్నెకు తిరిగి వచ్చారు. కాలిఫోర్నియా నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి చైన్నెకి గురువారం రాత్రి చేరుకున్నారు. వీరికి క్రీడల శాఖ, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ వర్గాలు బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానాలు పలికారు. క్యారమ్స్ క్రీడాకారులు, సంఘాలు ప్రతినిధులు సైతం పుష్పగుచ్ఛాలు, పూలమాలలు, కిరీటాలను ధరింప చేసి ఆహ్వానించారు. ఈ ముగ్గురు క్రీడాకారిణులు తాము సాధించిన బంగారు పతకాలతో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీ సీఈఓ జె.మేఘనాథరెడ్డిని కలిశారు. ఈసందర్భంగా వారిని డిప్యూటీ సీఎం ఉదయనిధి అభినందించారు. తమను విదేశాలకు పంపించేందుకు తోడ్పాటు అందించినందుకు క్రీడాకారిణులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
వాలీబాల్ వరల్డ్ బీచ్ ప్రో టూర్
చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలోని ఉత్తర నెమ్మేలిలో వాలీబాల్ వరల్డ్ బీచ్ ప్రో టూర్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. వాలీబాల్ వరల్డ్ బీచ్ ప్రో టూర్–2024 చైన్నె చాలెంజ్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఉదయనిధి మాట్లాడుతూ, సీఎం స్టాలిన్ నాయకత్వంలో తమిళనాడులో క్రీడలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇప్పటివరకు జరిగిన పోటీలను గుర్తుచేస్తూ, తమిళనాడులో క్రీడా స్ఫూర్తిని వివరించారు. క్రీడలను ప్రోత్సహించడంలో ఉత్తమ రాష్ట్రం అవార్డును సైతం దక్కించుకున్నామని గుర్తు చేశారు. బెస్ట్ ప్రమోటర్ ఆఫ్ స్పోర్ట్స్ అవార్డు కూడా తమిళనాడు సొంతం చేసుకుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పోటీల్లో భారత్ నుంచి రెండు మహిళా జట్లు పాల్గొంటుండడం, ఇందులో ముగ్గురు తమిళనాడు క్రీడాకారిణులు ఉండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే, మూడు పురుషుల జట్లు సైతం భారత్ తరఫున పాల్గొంటుండడం, ఇందులో నలుగురు తమిళనాడు క్రీడాకారులు ఉన్నారని వివరించారు. మంత్రులు అన్బరసన్, టీఆర్‌బీ రాజా, అధికారులు అతుల్య మిశ్రా, మేఘనాథరెడ్డి పాల్గొన్నారు.
చైన్నెకి క్యారమ్స్ విజేతలు
అభినందించిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
చెంగల్పట్టు జిల్లా వేదికగా బీచ్ వాలీబాల్
Comments
Please login to add a commentAdd a comment