ఐఐటీలో దివ్యాంగులకు క్రీడలు
సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసులో ఎన్‌సీఏహెచ్‌టీ అండ్ ఆర్2డీ2, ఆర్‌ఆర్‌డీలతో కలసి దివ్యాంగులకు తిరుమై స్పోర్ట్స్ క్రీడలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో దివ్యాంగులకు నిపుణులైన కోచ్‌లతో శిక్షణ ఇవ్వడానికి, అనుకూల పరికరాలను అన్వేషించడానికి, సమగ్ర వాతావరణంలో వారి నైపుణ్యాలను పెంచుకునేందుకు వీలుగా వేదికను రూపొందించారు. వికలాంగులకు అనుకూల క్రీడలను పరిచయం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ప్రకటించారు. 24వ తేదీ వరకు జరిగే పోటీల్లో 100 మంది దివ్యాంగులు 8 రకాల గేమ్‌లలో పాల్గొననున్నారు. ఐఐటీ మద్రాస్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం కో–ఆర్డినేటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మనీష్ ఆనంద్, మేనేజింగ్ డైరెక్టర్ కౌశిక్ సమక్షంలో ఐఐటీ మద్రాస్ డీన్ (విద్యార్థులు) ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్.గుమ్మడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యనారాయణ ఎన్. గుమ్మడి మాట్లాడుతూ తిరమై స్పోర్ట్స్ 4 ఆల్ ఈవెంట్ వికలాంగులకు వేదికను అందించడానికి ప్రత్యేకమని వివరించారు. రాబోయే సంవత్సరాల్లో మరింత ఎక్కువ మంది ఇక్కడి పోటీలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైకల్యం ఉన్న వారికి సామర్థ్యాలను, క్రీడలలో భవిష్యత్తు అవకాశాల కోసం మంచి ప్రతిభను పెంపొందించడం తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ మనీష్ ఆనంద్ మాట్లాడుతూ, ఈ ఈవెంట్ ఆర్2డి2, ఏసీఏహెచ్‌టీ ద్వారా ఏర్పాటు చేశామని గుర్తు చేస్తూ, విభిన్న వైకల్యాలున్న వ్యక్తులను ఒకచోట చేర్చడం ద్వారా, ఇది శారీరక శ్రేయస్సు, సామాజిక ఏకీకరణను ప్రోత్సహిస్తుందన్నారు. ఇక్కడ వీల్ చైర్ బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్, రేసింగ్, టేబుల్ టెన్నిస్, త్రో ఈవెంట్స్–జావెలిన్, డిస్కస్, షాట్‌పుట్ పోటీలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment