No Headline
● రాజకీయ చర్చ
సాక్షి, చైన్నె: దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ భేటీ అయ్యారు. రాజకీయ అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం. పార్టీ ఆవిర్భావంతో ఎదుర్కొన్న అన్ని ఎన్నికలను నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఒంటరి పయనం చేస్తున్న విషయం తెలిసిందే. క్రమంగా ఓటు బ్యాంక్‌ను సీమాన్ పెంచుకుంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సినీ నటుడు విజయ్ తమిళ వెట్రి కళగం ఏర్పాటుతో సహచర సినీరంగానికి చెందిన తాను సైతం ఆహ్వానిస్తున్నట్టు సీమాన్ ప్రకటించారు. అలాగే, ఒక రాజకీయనాయకుడిగా విజయ్ తమిళగ వెట్రి కళగం సిద్ధాంతాల కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, మహానాడు వేదికగా ప్రకటించిన విజయ్ పార్టీ సిద్ధాంతాలు తనకు నచ్చలేదంటూ వ్యతిరేకించడం మొదలెట్టారు. తొలుత విజయ్‌కు మద్దతుగా వ్యాఖ్యల తూటాలను పేల్చిన సీమాన్ తాజాగా తీవ్ర వ్యతిరేక స్వరంతో ముందుకెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో రజనీకాంత్‌తో సీమాన్ గురువారం రాత్రి భేటీ అయినట్టుగా శుక్రవారం సమాచారం వెలువడింది. అరగంటకు పైగా ఈ భేటీ జరగడం గమనార్హం. ఇందులో తమిళ రాజకీయ అంశాల గురించి చర్చ జరిగినట్టు తెలిసింది. రజనీకాంత్ అభిమానుల మద్దతును కూడగొట్టే దిశగానే సీమాన్ ఆయనతో భేటీ అయినట్టు చర్చ ఊపందుకుంది. అయితే, ఈ భేటీ మర్యాద పూర్వకమేనని వారు పేర్కొంటున్నా, దీని వెనుక రాజకీయ అంశం ఉండే ఉంటుందని తమిళ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment