No Headline
● శ్రీకారం చుట్టిన చైన్నె కార్పొరేషన్
సాక్షి, చైన్నె: చైన్నె నగరంలోని తోపుడుబండ్ల వ్యాపారులకు గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలైంది. శుక్రవారం నుంచి కార్పొరేషన్ మండల కేంద్రాలలో ఈ గుర్తింపు కార్డులను అందజేస్తున్నారు. చైన్నె నగరంలోని రోడ్డు పక్కగా తోపుడు బండ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి బంక్‌లు, ఫాస్ట్‌ఫుడ్‌లు, వివిధ రకాల విక్రయాలు అనేకం కనిస్తుంటాయి. ఈ కారణంగా ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉంటున్నాయని ఇటీవల పరిశీలనలో తేలింది. కార్పొరేషన్ పరిధిలోని 15 మండలాలో 36 వేల మేరకు ఉన్న వీధులు, రోడ్లలో జరిపిన పరిశీలన మేరకు 35,588 మంది రోడ్డు పక్క వ్యాపారులు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 20 వేల మంది తోపుడు బండ్లను ఉపయోగిస్తున్నట్టు తేలింది. రోడ్డు పక్క దుకాణాలను క్రమబద్ధీకరించేందుకు కమిషనర్ కుమరగురుబరన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. తన నేతృత్వంలోని ఈ కమిటీ ద్వారా ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. రోడ్డు పక్క వ్యాపారులకు నష్టం కలగకుండా, ట్రాఫిక్ కష్టాలు ఎదురు కాకుండా వారి జీవన పరిస్థితిని మెరుగు పరిచేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. కార్పొరేషన్ నేతృత్వంలో గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియకు నిర్ణయించారు. చైన్నె వ్యాప్తంగా 776 ప్రాంతాల్లో రోడ్డు పక్క విక్రయాలకు అనుమతి ఇచ్చే విధంగా నిర్ణయించారు.
తొలి విడతగా 39 రోడ్లలో రోడ్డు పక్క వ్యాపారులకు అనుమతి కల్పించే విధంగా వివిధ రకాల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దుకాణాలకు బదులుగా కార్పొరేషన్ నేతృత్వంలో ప్రత్యేకంగా వాహనం వ్యాపారులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా రోడ్డు పక్క వ్యాపారులకు గుర్తింపుకార్డుల పంపిణీ ప్రక్రియపై దృష్టి పెట్టారు. కార్పొరేషన్ పరిధిలోని మండల కార్యాలయాలలో ఈ గుర్తింపు కార్డుల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డు కోసం ఫుట్‌పాత్, రోడ్డు పక్క వ్యాపారులు దరఖాస్తులు చేసుకుని, తమ వివరాలను తెలియజేసి పొందే రీతిలో ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment