గ్రీవెన్స్‌డేకు 165 వినతులు
తిరువళ్లూరు: కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు 165 వినతులు వచ్చినట్టు కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ తెలిపారు. సమావేశానికి అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరుకాగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వేర్వేరు సమస్యలను పరిస్కరించాలని కోరుతూ కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇంటి పట్టాల కోసం 68 వినతులు, సాంఘిక సంక్షేమ శాఖకు 16 వినతులు, మౌలిక వసతులు కల్పించాలని 45 , ఉపాధి కల్పించాలని 9 సహా మొత్తం 165 వినతులు వచ్చినట్టు కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ వివరించారు. వీటిని ఆయాశాఖలకు చెందిన అధికారులకు బదిలీ చేసిన కలెక్టర్, తక్షణం వాటిని పరిస్కరించాలని కానీ పక్షంలో అందుకు గల కారణాలను వారికి వివరించాలని ఆదేశించారు. అనంతరం వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌డేకు హాజరై వారి నుంచి వినతులను స్వీకరించారు. గత వారం రోజుల క్రితం ఇచ్చిన వినతుల్లో అర్హులైన 12 మందికి సంక్షేమ పథకాలను సైతం అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో రాజ్‌కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్ ఆర్డీఓ కర్పగంతో పాటు పలువురు పాల్గొన్నారు.
కుశస్థలినదిలో వృద్ధుడి గల్లంతు
తిరుత్తణి: కుశస్థలి నదిలో వరదలో చిక్కుకుని వృద్ధుడు గల్లంతయ్యాడు. ఇటీవల కుమ్మరించిన వర్షాలకు కుశస్థలినదిలో వరద పోటెత్తింది. ఈ క్రమంలో కనకమ్మసత్రం సమీపంలోని రామంజేరి ప్రాంతంలోని ఆదివారం సాయంత్రం కుప్పత్తుకండ్రిగ గ్రామానికి చెందిన లక్ష్మయ్య(64) నది దాటుకుని గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేశాడు. వరదలో చిక్కుకుని గల్లంతయ్యాడు. అక్కడే చేపల వేటలో వున్న గ్రామస్తులు వృద్ధుడిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కనకమ్మసత్రం పోలీసులతో పాటు ఈగ్నిమాపక శాఖ సిబ్బంది నదిలో గాలిస్తున్నారు.
టాస్మాక్ దుకాణంలో చోరీ
తిరువళ్లూరు: టాస్మాక్ దుకాణానికి కన్నం వేసి రూ.లక్ష విలువ చేసే మద్యం బాటిల్స్‌ను ఎత్తుకెళ్లిన ఘటన పెద్దపాళ్యం సమీపంలో జరిగింది. తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలో ప్రభుత్వ టాస్మాక్ దుకాణం ఉంది. ఆదివారం యధావిధిగా వ్యాపారం ముగిసిన తరువాత నగదును లాకర్‌లో ఉంచి దుకాణానికి తాళం వేసుకుని సేల్స్‌మెన్ దేవేంద్రన్ వెళ్లినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి దుకాణం వద్దకు వచ్చిన దొంగలు దుకాణానికి వెనుక భాగంలో కన్నం వేసి రూ.లక్ష విలువ చేసే 750 మద్యం బాటిల్స్ ఎత్తుకెళ్లారు. సోమవారం దుకాణం తెరవడానికి వచ్చిన సిబ్బంది గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment