12 నుంచి చైన్నె అంతర్జాతీయ చిత్రోత్సవాలు
తమిళసినిమా: ఈనెల 12వ తేదీ నుంచి చైన్నెలో 22వ చైన్నె అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుక జరగనుంది. ఈ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో గత 21 ఏళ్లుగా చైన్నెలో ఇండో అప్రిషియేషన్ సంస్థ నిర్వహిస్తూ వస్తోంది. అదే విధంగా ఈ ఏడాది 22వ చైన్నె అంతర్జాతీయ చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. ఈ చిత్రోత్సవాల్లో 50 దేశాలకు చెందిన పలు అంతర్జాతీయ స్థాయి అవార్డులను గెలుసుకున్న వివిధ భాషలకు చెందిన 123 చిత్రాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. అందులో ముఖ్యంగా కాన్ ఫిలిం చిత్రోత్సవాలకు నామినేట్ అయినా, అవార్డులను గెలుచుకున్న 11 చిత్రాలు, వెనీస్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులను గెలుచుకున్న 3 చిత్రాలు, ఇండియన్ పనోరమ అవార్డులను గెలుచుకున్న మరో 8 చిత్రాలు, బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు గెలుచుకున్న 8 చిత్రాలతో పాటు పలు దేశాలకు చెందిన ఉత్తమ చిత్రాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. అదే విధంగా తమిళనాడు ప్రభుత్వం ఎంజీఆర్ ఫిలిం అండ్ టీవీ ఇన్‌స్టిట్యూట్ విద్యార్దులు రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఇకపోతే 25 తమిళ చిత్రాలను ఉత్తమ అవార్డుల పోటీకి జ్యూరీ సబ్యులు ఎంపిక చేశారనీ, ఆ చిత్రాల వివరాలను అవార్డుల వేదికపైనే ప్రకటించనున్నట్లు చెప్పారు. ఈనెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ఈ చిత్రోత్సవాల వేడుకలు స్థానికి రాయపేటలోని సత్యం థియేటర్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా చిత్రాల ప్రదర్శనలను సత్యం, ఐనాక్స్ థియేటర్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకూ ప్రర్శించనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment