సాక్షి, చైన్నె: ఫెంగల్ తుపాన్ తొలుత రాష్ట్రంలోని విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చిపై ప్రభావాన్ని చూపించిన విషయం తెలిసిందే. తర్వాత తిరువణ్ణామలై, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మునుపెన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలతో తమిళనాడులోని ఇతర ఉత్తరాది జిల్లాల మీద కూడా ప్రభావం పడింది. పైన పేర్కొన్న జిల్లాలో చాలా ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బ తినడమే కాకుండా, జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ జిల్లాలో సహాయక చర్యలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు సీఎం ఎంకే స్టాలిన్ నిర్ణయించారు.
మూడు జిల్లాల్లో
బాధితులకు వరద పరిహారం
సోమవారం విల్లుపురం జిల్లాలో సీఎం పర్యటించారు. జరిగిన నష్టం తీవ్రతపై అధికారులతో సమీక్షించారు. ప్రజల గోడును విన్నారు. మంగళవారం ఉదయాన్నే సచివాలయం నుంచి విల్లుపురం, కడలూరు, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి జిల్లాలో జరుగుతున్న సహాయక పనులపై కలెక్టర్లతో, డిప్యూటీసీఎం ఉదయనిధి, మంత్రులతో సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఫెంగల్ సృష్టించిన విలయం, బాధితులకు ఎదురైన కష్టాలు, నష్టాల మీద చర్చించారు. సహాయక పనులు విస్తృతం చేయాలని ఆదేశించారు. గ్రామాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం బాధితులను ఆదుకునే విధంగా సీఎం ప్రకటన చేశారు.
పెను విలయాన్ని ఎదుర్కొన్న విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చిలోని బాధితులకు మాత్రం కుటుంబ కార్డు ఆధారంగా ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు పరిహారం ప్రకటించారు. ఇక్కడి ప్రజలు జీవనోపాధిని కోల్పోవడంతోనే ఈ ప్రత్యేక పరిహారం ప్రకటించినట్లు సీఎం వివరించారు. తిరువణ్ణామలై, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాలోని బాధితులకు సైతం ఈ ప్రత్యేక నగదు పరిహారం పంపిణీకి పరిశీలన జరుపుతున్నారు. సమగ్ర వివరాలను సమర్పించాలని ఆ జిల్లాల అధికారులను సీఎం ఆదేశించారు.
కుటుంబ కార్డుదారులకు రూ. 2 వేలు విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చి జిల్లావాసులకు వర్తింపు
తిరువణ్ణామలై, ధర్మపురి, కృష్ణగిరికి పరిశీలన ఆరు జిల్లాల్లో ప్రాణ, ఆస్తి, పంట నష్టం బాధితులకు భరోసా
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం గుడిసెకు రూ. 10 వేలు
వరిపంట హెక్టారుకు రూ. 17 వేలు సాయం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
ఫెంగల్ బాధిత విల్లుపురం, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, కడలూరు, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఆస్తి, ప్రాణ, పంట తదితర నష్టాలను పరిగణించి పరిహారం ప్రకటించారు. ఈ మేరకు తుపాన్, వదర విలయంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
దెబ్బతిన్న గుడిసెలకు పరిహారం రూ 10 వేలు అందజేయనున్నారు. పూర్తిగా దెబ్బ తిన్న గుడిసెల స్థానంలో కలైంజ్ఞర్ కలల గృహం పథకం ద్వారా కొత్త ఇంటి నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
వర్షం ప్రభావంతో (33 శాతం, అంతకంటే ఎక్కువ) దెబ్బతిన్న వరి పంట హెక్టారు కు రూ.17 వేలు ఇవ్వనున్నారు. ఇతర పంటలకు (33 శాతం, అంతకంటే ఎక్కువ) ఒక్కో రైతుకు రూ.22,500 అందించనున్నారు. మరికొన్ని పంటలకు హెక్టారుకు రూ.8,500 ఇవ్వనున్నారు.
పశువులు మరణించి ఉంటే ఒక్కో దానికి రూ. 37,500 ఇవ్వనున్నారు. మేకలు, గొర్రెలకు రూ. 4 వేలు, కోళ్లకు రూ.100 పరిహారం ప్రకటించారు.
సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, కుటుంబ కార్డులు వంటివి వరదలలో కొట్టుకెళ్లి ఉంటే, ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి కొత్తవి మంజూరు చేయనున్నారు.
వర్షం, వరదల కారణంగా పుస్తకాలను కోల్పోయిన విద్యార్థులకు కొత్తవి అందజేయడానికి నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment