సాత్తనూరే.. ముంచేసిందా?
● అకస్మాత్తుగా డ్యాం గేట్లు ఎత్తేశారంటూ ఆరోపణలు ● అందుకే తెన్‌పైన్నె నదిలో ప్రమాదకర స్థాయిలో వరద ● ఐదుసార్లు హెచ్చరికలు జారీ చేశామన్న మంత్రి దురైమురుగన్ ● పెను ప్రాణనష్టం తప్పించేందుకే నీటి విడుదల అని ప్రక టన ● బాధిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు ● పలుచోట్ల గ్రామీణుల పోరుబాట ● మంత్రి పొన్ముడిపై బురదతో దాడి
సాక్షి, చైన్నె: విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై జిల్లాలను పెను ప్రళయం చుట్టు ముట్టడానికి ప్రధాన కారణం సాత్తనూరు డ్యాం నుంచి అకస్మాత్తుగా నీటి విడుదలే కారణం అనే వాదన వినిపిస్తోంది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై మంగళవారం దాడికి దిగాయి. ఒక్క సారిగా లక్షా 50 వేల క్యూ సెక్కులకు పైగా నీటిని విడుదల చేయడంతోనే నాలుగు జిల్లాలు వరద ముంపునకు గురైనట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఐదుసార్లు వరద హెచ్చరికలు జారీ చేసినానంతరమే నీటిని విడుదల చేశామని నీటి పారుదల శాఖమంత్రి దురై మురుగన్ స్పష్టం చేశారు. నీటిని విడుదల చేయకుండా ఉండి ఉంటే పెను ప్రాణ నష్టం జరిగి ఉండేదని అన్నారు.
విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలైలలో ఫెంగల్ తాండవం గురించి తెలిసిందే. విల్లుపురం, మైలం , విక్రవాండి, దిండివనం పరిసరాలలో అధిక వర్షం నమోదైనా, తెన్ పైన్నె నదీ తీరంలోని గ్రామాలన్నీ వరద ముంపునకు గురి కావడాన్ని ప్రతి పక్షాలు తీవ్రంగా పరిగణించాయి. 250 గ్రామాల మధ్య సంబంధాలు తెగినట్టు, 150 గ్రామాలను వరదలు చట్టుముట్టినట్టుగా సమాచారం. వేలాది గృహాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ వరద ముంపునకు కారణం తిరువణ్ణామలైలోని సాత్తనూరు డ్యాం గేట్ల ఎత్తి వేతే కారణం అనే ఆరోపణలు ఊపందుకున్నాయి. కృష్నగిరి నుంచి తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, విల్లుపురం, కడలూరు మీదుగా తెన్‌పైన్నె నది ప్రవహించి సముద్రంలో కలుస్తుంటోంది. ఈ నదీ తీరంలోని తిరువణ్ణామలై జిల్లాలో సాత్తనూరు డ్యాం ఉంది. 119 అడుగులతో కూడిన ఈ డ్యాం అతి భారీ వర్షాలకు నిండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా రాత్రికి రాత్రే అధికారులు గేట్లను ఎత్తి వేయడంతో తెన్ పైన్నె నది ఉగ్ర రూపం దాల్చడంతో ఆ నదీ తీరంలోని గ్రామాలన్నీ ముంపును ఎదుర్కోవాల్సి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని అస్త్రంగా చేసుకున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు తదితరులు డీఎంకే పాలకులపై దుమ్మెత్తి పోసే పనిలో పడ్డారు. ఇది ఫెంగల్ రూపంలో ఎదురైన ముంపు కాదని, డ్యాం గేట్ల ఎత్తివేత రూపంలో జరిగిన నిర్లక్ష్యం అన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. సాత్తనూరు ముంచేసిందన్న సమాచారంతో తెన్ పైన్నె నదీ తీరంలోని గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడ ఆందోళన బాట పట్టే పనిలో పడ్డారు. దీంతో నీటి పారుదల శాఖమంత్రి దురై మురుగన్ స్పందించారు.
తప్పిన పెను ప్రాణనష్టం
తిరువణ్ణామలై జిల్లా సాత్తనూరు డ్యాంలో గత నెల 25వ తేదీ నాటికి 110 అడుగుల నీళ్లు ఉన్నట్టు వివరించారు. ఫెంగల్ రూపంలో ఒక్క సారిగా కురిసిన అతి భారీ వర్షాలతో డ్యాం నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వచ్చిందన్నారు. దీంతో తొలి ప్రమాద హెచ్చరికను తీర వాసులకు జారీ చేశారని, గత నెల 30వ తేదీ 117 అడుగులకు నీటిమట్టం చేరడంతో మళ్లీ మళ్లీ హెచ్చరికలు జారీ చేసి నీటిని విడుదల చేశామని మంత్రి వివరించారు. ఈనెల 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి నదీ పరివాహక ప్రదేశాలలో మరింత భారీ వర్షం పడడంతో సాయంత్రం 6 గంటల నుంచి క్రమంగా నీటి విడుదల మీద దృష్టి పెట్టామన్నారు. ఒక్కసారిగా నీటిని విడుదల చేయలేదని, ప్రతి గంటకు పరిశీలన జరిపి కొంచెం కొంచెంగా విడుదల చేశామన్నారు. 2వ తేదీ రాత్రి 8 గంటలకు సెకనుకు 1.68 లక్షల క్యూ సెక్కుల నీటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నీటిని విడుదల చేయకుండా ఉండి ఉంటే పెను ఆస్తి, ప్రాణ నష్టాన్ని ఎదుర్కునే పరిస్థితులు వచ్చి ఉండేదన్నారు. ఐదు సార్లు వరద హెచ్చరికలు ఇచ్చే నీటిని విడుదల చేశామని, ఫెంగల్ తుపాన్ గత నెల 30 వ తేదీన తీరాన్ని తాకిన విషయాన్ని గుర్తు చేస్తూ, మనఃసాక్షికి కట్టుబడి మాట్లాడాలని ప్రతి పక్షాలకు హితవు పలికారు. ఇదిలా ఉండగా కొనసాగుతున్న వర్షాల నేపథ్యంలో కావేరి నదిలో నీటి ఉధృతి పెరిగింది. మేట్టూరు డ్యాం వైపుగా హొగ్నెకల్ మీదుగా సెకనుకు 30 వేల క్యూ సెక్కుల నీరు ప్రవహిస్తోంది.
మంత్రి పొన్ముడిపై బురద దాడి
గ్రామాలలో సహాయక చర్యలు విస్తృతం చేశారు. వరద ఉధృతి తగ్గిన గ్రామాలలోకి సహాయక బృందాలు చొచ్చుకెళ్తున్నాయి. మరెన్నో గ్రామాల వైపుగా వేళ్ల లేని పరిస్థితి. ఆలస్యంగా అధికారులు తమ గ్రామల వైపుగా రావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ నిలదీస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విక్రవాండి టోల్ గేట్ వద్ద డీఎంకే కూటమిలోని వీసీకే నేతృత్వంలో బాధితులు ఆందోళనకు దిగడం చర్చకు దారి తీసింది. విక్రవాండిలో రాస్తారోకో జరగ్గా, బాధితులను మంత్రి పొన్ముడి పరామర్శించి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు బురదతో దాడి చేశారు. ఆయన చొక్కా అంతా బురద మయం కావడంతో పోలీసు భద్రత నడుమ ఆయన అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఇక, కడలూరులో డీప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వద్ద బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఆదుకోవాలని విన్నవించారు.
10 గంటలు పోరాడి..
వర్షం, వరద విలయంతో అనేక చోట్ల రోడ్ల మీద నీటి ఉధృతి కొనసాగుతోంది. సేలం – బెంగళూరు మధ్య జాతీయ రహదారిలోని వంతెన కింది భాగంలో తిరుమణి ముత్తారు ప్రమాదకరంగా నీటిఉధృతి కొనసాగుతోంది. తిరుచ్చి – చైన్నె జాతీయ రహదారిలో అనేక చోట్ల దాటడం గగనంగా మారింది. రెండవ రోజుగా రైలు సేవలకు ఆటంకాలు తప్పలేదు. విల్లుపురం జిల్లా తిరువన్నై నల్లూరు ఎంపుదూర్ గ్రామానికి చెందిన కలైయరసన్(57), ఆయన భార్య సుందరి(50), కుమారుడు పుగలేంది(25) వరదలలో కొట్టుకెళ్లారు. వీరు నీటి ఉధృతిలోనూపోరాడి కుమారుడు, భార్యను కలైయరసన్ రక్షించి వేపచెట్టు మీదకు ఎక్కించాడు. తాను సైతంపది గంటల పాటు ఆ చెట్టును పట్టుకుని రక్షించమని వేడుకున్నాడు. చివరకు ఆర్మీ హెలికాప్టర్ వచ్చి రక్షించేలోపు కలైయరస్ గల్లంతయ్యాడు. సుందరి, పుగలేందిని జవాన్లు రక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment