నిఘా నీడలోకి అన్నావర్సిటీ
● అధికారులతో మంత్రి భేటీ ● కఠినం కానున్న ఆంక్షలు, నిబంధనలు ● లైంగికదాడి ఘటనపై హైకోర్టు సుమోటో కేసు
సాక్షి, చైన్నె: అన్నావర్సిటీ పరిసరాలు ఇక పూర్తిస్థాయిలో నిఘా నీడలోకి రానున్నాయి. అధికారులతో ఉన్నత విద్యా మంత్రి కోవి చెలియన్ శుక్రవారం భేటీ అయ్యారు. కఠిన ఆంక్షలు, నిబంధనల అమలుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా లైంగిక దాడి వ్యవహారంపై విచారణకు హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
అన్నావర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి వ్యవహారం రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను అస్త్రంగా చేసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళకు భద్రత కరువైందంటూ అన్నాడీఎంకే, బీజేపీలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే పనిలోపడ్డాయి. ఈ పరిస్థితులలో పట్టుబడ్డ నిందితుడి జ్ఞానశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టినా, వ్యవహారం విద్యార్థి సంఘాల చేతికి చేరడంతో అనేక చోట్ల ఆందోళనలు మొదలయ్యాయి. శుక్రవారం పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలో పలుచోట్ల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై మద్రాసు హైకోర్టులో అన్నాడీఎంకే మహిళా న్యాయవాది విజ్ఞప్తితో కేసును సుమోటోగా న్యాయమూర్తులు స్వీకరించారు. సీజే అనుమతితో కేసు విచారణకు నిర్ణయించారు. అదేసమయంలో ఎఫ్‌ఐఆర్ పోలీసుల నుంచి లీక్ కాలేదన్న విషయాన్ని కోర్టుకు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు స్పష్టం చేశారు. జాతీయ మహిళా కమిషన్ సైతం విచారణపై దృష్టి పెట్టింది. ఎఫ్‌ఐఆర్ లీక్ వ్యవహారంలో బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదుకు మదురై పోలీసులకు ఫిర్యాదులు చేరాయి. అదే సమయంలో లైంగిక దాడి కేసులో ఓ వైపు పోలీసు కమిషనర్ అరుణ్, ఉన్నత విద్యా మంత్రి కోవిచెలియన్ పరస్పరం భిన్న వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారి తీశాయి. ఫిర్యాదు, సీసీ కెమెరాలు, వంటి వ్యవహారంలో కమిషనర్ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా మంత్రి స్పందించారు. అలాగే, నిందితుడి భార్య ఆ వర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగి అన్న విషయం తనకు తెలియదని కమిషనర్ పేర్కొనగా, కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నట్టుగా మంత్రి అంగీకరించడం గమనార్హం.
అధికారులతో మంత్రి భేటీ
అన్నావర్సిటీ అధికారులు, విద్యాశాఖ అధికారులతో వర్సిటీ ఆవరణలో ఉన్నత విద్యాశాఖ మంత్రి కోవి చెలియన్ సమావేశమయ్యారు. వర్సిటీలో చేపట్టాల్సిన భద్రత, అమలు చేయాల్సిన ఆంక్షలు, నిబంధనలు ఇతర అంశాల గురించి చర్చించారు. ఇక అన్నావర్సిటీలోకి ప్రవేశం మరింత కఠినం కానుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటి వ్యక్తులను వాకింగ్‌కు అనుమతించకుండా నిర్ణయించినట్టు తెలిసింది. గుర్తింపుకార్డులను కలిగి ఉన్న విద్యార్థి, సిబ్బందిని మాత్రమే ఇక లోనికి అనుమతించే విధంగా కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. కొన్ని గేట్లను మూసివేయడమే కాకుండా, ఎత్తు తక్కువగా ఉన్న ప్రహరీల వద్ద ఇనుప కమ్మీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉన్న భద్రతా పరంగా చర్యలు, సీసీ కెమెరాల అంశాల గురించి నివేదికను ఆయా ప్రిన్సిపల్స్ నుంచి సేకరించి భద్రతను కట్టుదిట్టం చేయడానికి సిద్ధమయ్యారు.
అన్నావర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment