మురుగన్ సేవలో గవర్నర్
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామిని రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్.రవి శుక్రవారం దర్శించుకున్నారు. గవర్నర్‌కు కలెక్టర్ ప్రభుశంకర్ స్వాగతం పలికారు. రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్.రవి తిరుమలలో స్వామి దర్శనం చేసుకుని రోడ్డు మార్గంలో తిరుత్తణికి చేరుకున్నారు. గవర్నర్ రాక సందర్భంగా డీఎస్పీ కందన్ ఆధ్వర్యంలో వందకుపైగా పోలీసులు పట్టణంతోపాటు కొండలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 11.40 గంటల సమయంలో కొండ ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు కలెక్టర్, ఎస్పీ శ్రీనివాసపెరుమాళ్, ఆలయ జాయింట్ కమిషనర్ రమణి స్వాగతం పలికారు. ప్రధాన ఆలయ గేటు ద్వారా ఆలయంలోకి ప్రవేశించి ముందుగా ఆలయ ధ్వజస్తంభానికి మొక్కి అనంతరం మూలవర్లను దర్శించుకున్నారు. అలాగే వల్లి, దేవసేన సమేత ఉత్సవమూర్తి, షణ్ముఖర్ సహా ఇతర దేవతలను దర్శించుకున్నారు. ఆయనకు మురుగన్ చిత్రపటంతోపాటు ప్రసాదాలు అందజేశారు. గవర్నర్ రాకతో కొండ ఆలయ ఘాట్‌రోడ్డులో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. క్యూలో వేచివున్న భక్తులకు గంటపాటు దర్శనం నిలిపివేయడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నేడు కెప్టెన్ తొలి వర్ధంతి
సాక్షి, చైన్నె: డీఎండీకే అధినేత, అందరి నోట కెప్టెన్‌గా పిలవబడే సినీ నటుడు విజయకాంత్ అందరినీ వీడి శనివారంతో ఏడాది కానుంది. గురుపూజోత్సవంగా తొలి వర్ధంతి నిర్వహణకు ఆపార్టీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. ఈ వేడుకకు హాజరుకావాలని సీఎం స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో పాటు పలు పార్టీల నేతలను డీఎండీకే నాయకులు సుదీష్, విజయకాంత్ తనయుడు విజయప్రభాకరన్ ఆహ్వానించారు. తాజాగా తమిళగ వెట్రి కళగం నేత, విజయ్‌ను ఆహ్వానించారు. చైన్నెలోని డీఎండీకే కార్యాలయ ఆవరణలో విప్లవ కథానాయకుడు విజయకాంత్ శాశ్వత నిద్రలో ఉన్న విషయం తెలిసిందే. కెప్టెన్ ఆలయంగా దీనిని ప్రకటించారు. ఇక్కడ నిత్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలి వర్ధంతి సందర్భంగా ర్యాలీలు, సేవా కార్యక్రమాలు నిర్వహణకు డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ఏర్పాట్లు చేశారు. ఆ పార్టీ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరగనున్నాయి.
ఈరోడ్ తూర్పు మాదే...
సాక్షి, చైన్నె: ఈరోడ్ తూర్పు నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన నివేదిక ఆ పార్టీ అధిష్టానానికి పంపించారు. ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇళంగోవన్ ఇటీవల అనారోగ్యంతో కన్ను మూసిన విషయం తెలిసిందే. ఇక్కడ కాంగ్రెస్‌కు మరో బలమైన నేతలు లేకపోవడంతో ఈసారి డీఎంకే అభ్యర్థిని రంగంలోకి దించే దిశగా సీఎం స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈరోడ్ పర్యటన సందర్భంగా డీఎంకే నేతలు సైతం ఈసారి పోటీచేద్దామని, 2026 ఎన్నికలకు ఈ గెలుపును రెఫరెండంగా మార్చుకుందామన్న నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికలలో పోటీ చేయలా.. వద్దా అనే డైలమాలో ఉన్నట్టు సమాచారాం. అయితే తమ సిట్టింగ్ సీటును వదలుకునే స్థితిలో కాంగ్రెస్ లేనట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ సీనియర్ నేత ఒకరు పోటీకి సిద్ధంగా ఉండడంతో డీఎంకే నుంచి సీటును ఆశించేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీ పెద్దల ద్వారా సంప్రదింపులతో ఈరోడ్ ఉప ఎన్నికలలో తమ అభ్యర్థిని రంగంలోకి దించే దిశగా రాష్ట్ర కాంగ్రెస్ కసరత్తుల వేగాన్ని పెంచిందని ఓ నేత పేర్కొన్నారు.
ట్రాఫిక్ పోలీసులకు నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ ఫోన్
సాక్షి, చైన్నె: ట్రాఫిక్‌లో విధులు నిర్వహించే పోలీసులకు నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్‌ఫోన్‌ల పంపిణీపై గ్రేటర్ చైన్నె ట్రాఫిక్ విభాగం దృష్టిపెట్టింది. ట్రాఫిక్ సిబ్బందికి శబ్ధకాలుష్యం నుంచి విముక్తి కల్పించే విధంగా ఈ ఇయర్ ఫోన్లను శుక్రవారం పంపిణీ చేసింది. ట్రాఫిక్ కూడళ్లలో విధుల్లో ఉండే సిబ్బంది ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ట్రాఫిక్ పోలీసుల కోసం ఇయర్‌ప్లగ్‌లు, నాయిస్ క్యాన్సిలింగ్‌ను పరిచయం చేశారు. శుక్రవారం నుంగంబాక్కం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో 20 మందికి ఈ సాంకేతికతను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment