పెద్ద పండుగ సందడి
భాగ్యాలనిచ్చే భోగి, సరదాల సంక్రాంతి, కమ్మని కనుమ సంబరాలతో పెద్ద పండుగ రానే వచ్చింది. ఇందులో తొలిరోజైన సోమవారం వేకువజామున ఇళ్ల ముంగిళ్లల్లో భోగి మంటలు ఎగసి పడ్డాయి. భోగే భోగి అంటూ యువత, పిల్లలు తప్పెట్లు, డప్పుల హోరుతో సందడి చేశారు. పొగ ఓ వైపు, మంచు మరో వైపు వెరసి చైన్నెలో విమాన సేవలకు ఆటంకాలు కలిగించాయి. మంగళవారం ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. అలాగే వీరత్వానికి ప్రతీకగా ఉన్న జల్లికట్టుకు అవనీయాపురంలో శ్రీకారం చుట్టనున్నారు.
సాక్షి, చైన్నె: ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో జరుపుకునే పెద్ద పండగ రానే వచ్చింది. ఇందులో తొలిరోజైన సోమవారం ఇంటి ముంగిళ్లలో భోగి మంటలు ఎగసి పడ్డాయి. వేకువ జామున ఇళ్లలోని పాత, పనికి రాని వస్తువుల్ని భోగి మంటల్లో ప్రజలు వేశారు. తమ తమ ఇళ్ల ముందు, బహుళ అంతస్తులు, అపార్ట్‌మెంట్ల ముంగిట భోగి మంటలతో ఆనందాన్ని పంచుకున్నారు. కొన్నిచోట్ల ఇళ్లలోని పాత చాపలు, చీపుర్లు , అట్ట పెట్టెలు వంటి పాత వస్తువులను భోగి మంటలలో వేసి పర్యావరణాన్ని ఆటకం కల్గించకుండా సంబరాలు చేసుకున్నారు. పిల్లలు, యువకులు తప్పెట్లను వాయిస్తూ, భోగే..భోగి నినాదంతో తమతమ ప్రాంతాలను చుట్టి వచ్చారు. మరికొన్ని చోట్ల కొయ్య చెక్కలను పేర్చి మంటలు వేశారు. ఓ వైపు మంచు, మరోవైపు భోగి మంటల పొగ కప్పేయడంతో ఉదయాన్నే చైన్నె వంటి నగరాలలో వాహన చోదకులు, వాకర్లు ఇబ్బందులు తప్పలేదు. అలాగే, ఉదయాన్నే చైన్నెకు రావాల్సిన, బయలు దేరాల్సిన అనేక విమానాల సేవలకు ఆటంకం తప్పలేదు. విమానాశ్రయ పరిసర ప్రాంతాలలో ఎగసి పడ్డ భోగిమంటల పొగ విమానాలకు సెగగా మారింది. ఆకాశాన్ని మంచు, పొగ కప్పేయడమే కాదు, వర్షం సైతం పడడంతో వాతావరణం పూర్తిగా మారింది. మూడు విమానాల సేవలు రద్దు కాగా, సుమారు 30 విమాన సేవలు ఆలస్యంగా జరిగాయి. వర్షం కారణంగా కాలుష్యం కాస్త చైన్నెలో తగ్గినట్లయ్యింది. ఇక భోగి రోజున మాంసాహారం స్వీకరించే వారు అధికం కావడంతో చేపల మార్కెట్లు, చికెన్, మటన్ సెంటర్లు కిటకిటలాడాయి.
సంక్రాంతి సంబరాలు..
పెద్ద పండుగలో సంక్రాంతిని మంగళవారం జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధం అయ్యారు. సోమవారం కూడా షాపింగ్ మాల్స్‌లో జనం కిక్కిరిశారు. కోయంబేడు, ప్యారీస్, తాంబరం, పురసైవాక్కం తదితర మార్కెటల్లో సంక్రాంతి పూజా సామాగ్రి విక్రయాలు, పొంగళ్లు పెట్టేందుకు కుండల కొనుగోలు జోరుగా సాగింది. అయితే వీటి ధరలకు రెక్కలు వచ్చాయి. రాష్ట్రంలోని ఇతరమార్కెట్లలో పండుగ షాపింగ్ ఊపందుకుంది. శనివారం నుంచి సెలవులు కలిసి రావడంతో వివిధ ప్రాంతాలలో ఉన్న వాళ్లంతా తమ తమ స్వగ్రామాలకు చేరుకుని కుటుంబాలతో ఆనందంగా గడిపే పనిలో పడ్డారు. చైన్నె నుంచి గత మూడు రోజులలో 15 లక్షల మంది స్వస్థలాలకు తరలి వెళ్లారు.
జల్లికట్టుకు రెడీ..
తమిళుల వీరత్వాన్ని చాటే జల్లికట్టుకు మదురై జిల్లా అవనియాపురంలో మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. ఆంక్షలు, నిబంధనలకు అనుగుణంగా రంకెలు వేయడానికి బసవన్నలు, వాటి పొగరు అణిచేందుకు క్రీడా కారులు సిద్ధమయ్యారు. బుధవారం పాలమేడులో, గురువారం అలంగానల్లూరులో జల్లికట్టు రంకెలు వేయనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ మూడు ప్రాంతాలలో జల్లికట్టు నిమ్తితం క్రీడాకారులు తమపేర్లను ఇప్పటికే నమోదు చేసుకున్నారు. ఎద్దుల యజమానులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నప్పటికీ సమగ్ర పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం వాడి వాసల్ వైపుగా ఎద్దులను అనుమతించనున్నారు. తొలి జల్లికట్టు అవనియాపురంలో జరగనుండడంతో ఇక్కడ సర్వం సిద్ధం చేశారు. 1,100 ఎద్దులు, 400 మంది క్రీడాకారులు ఇక్కడ తమ వీరతాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యారు.
శుభాకాంక్షలు..
సంక్రాంతి పండుగను ప్రజలు ఆనందోత్సాహలతో జరుపుకోవాలని నేతలు ఆకాంక్షించారు. గవర్నర్ ఆర్‌ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, మాజీ సీఎం పన్నీరు సెల్వం, ఎండీఎంకే నేత వైగో, కాంగ్రెస్ నేత సెల్వ పెరుంతొగై, అమ్మ మక్కల్ కళగం నేత దినకరన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, పీఎంకే నేత రాందాసు, అన్బుమణి రాందాసు తదితరులు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరి జీవితాలలో వెలుగు నిండాలని, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నారు.
సంక్రాంతి పతకాలు..
పొంగల్(సంక్రాంతి) పండుగ సందర్భంగా 2025 సంవత్సరానికి గాను 3,186 మంది పోలీసులకు పతకాలను సీఎం స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడులోని పోలీస్, ఫైర్ అండ్ రెస్క్యూ, జైళ్లు తదితర విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు విధి నిర్వహణలో పనితీరుకు గుర్తింపుగా పొంగల్ సందర్భంగా పతకాలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా 2025 సంవత్సరానికి గాను పోలీసు విభాగంలోని కానిస్టేబుల్ గ్రేడ్ 2, 1, హెడ్ కానిస్టేబుల్, స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్లు 3 వేలమందికి పతకాలను ప్రకటించారు. ఫైర్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ విభాగంలో ఫైర్‌మ్యాన్, మెకానికల్ డ్రైవర్, ఫైర్‌మ్యాన్ డ్రైవర్ (స్టేడ్ రైజ్డ్ మెకానికల్ క్యాంబర్ డ్రైవ్) ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ట్ , ఎలివేటెడ్ లీడ్ ఫైర్‌ఫైటర్)లు 120 మందిని, జైళ్లు శాఖలోని వార్డెన్లు, తదితర సిబ్బంది 60 మందిని కూడా ఈ పతకాలకు ఎంపిక చేశారు. ఈ పతకాలతో పాటూ వీరికి నెలవారీ స్టైఫండ్ నెలకు రూ. 400 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అందించనున్నారు. అలాగే పోలీస్ రేడియో యూనిట్, స్నిఫర్ యూనిట్, పోలీస్ ఫొటోగ్రాఫర్స్ డివిజన్లలో పనిచేస్తున్న వారిలో ప్రతి విభాగానికి ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురిని ఈ పతకాలకు ఎంపిక చేశారు.
కోలాహలంగా భోగి వేడుకలు తప్పెట్లు, డప్పులతో కోలాహలం
కమ్మేసిన పొగమంచు విమాన సేవలకు ఆటంకం
నేతల శుభాకాంక్షలు పోలీసులకు పొంగల్ పతకాలు
నేడు సంక్రాంతి సంబరాలు, జల్లికట్టుకు శ్రీకారం
Comments
Please login to add a commentAdd a comment