● అన్నాడీఎంకే కేడర్‌కు విన్నపం ● సహకారానికి సిద్ధం అన్న
మద్దతు బాటలో సీమాన్
సాక్షి, చైన్నె: ప్రధాన పార్టీలు ఉప ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో డీఎంకేతో ప్రత్యక్ష సమరానికి నామ్ తమిళర్ కట్చి సిద్ధమైంది. అదే సమయంలో ఎన్నికలను బహిష్కరించిన పార్టీల మద్దతు దారులు, కేడర్ మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాలలో నామ్‌తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ ఉన్నారు. వివరాలు.. ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వేడి తగ్గినట్లయ్యింది. ఇందుకు కారణం ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్నాడీఎంకే, బీజేపీ,డీఎండీకేలు బహిష్కరించడమే. ఈ ఎన్నికలలో ప్రస్తుతం డీఎంకే అభ్యర్థి చంద్రకుమార్ పోటీలో ఉన్నారు. ఆయన్ని ఢీకొట్టే విధంగా బలమైన ప్రత్యర్థిని బరిలో దించే విధంగా నామ్‌తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. అధికార డీఎంకేను ప్రత్యక్షంగా ఢీకొట్టే అవకాశం తమకు ప్రస్తుతం దక్కడంతో అవకాశాన్ని సద్వినియోగంచేసుకుని ఓట్ల శాతం పెంపునకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా అన్నాడీఎంకే, డీఎండీకే కేడర్, మద్దతుదారులను ఆకర్షించే ప్రయత్నాలపై దృష్టి కేంద్రీకరించారు. ఆ ఓట్ల తమ ఖాతాలోపడే రీతిలో ఆ కేడర్‌కు విన్నవించుకునేందుకు సీమాన్ సిద్ధమయ్యారు. అధికార పక్షాన్ని ఢీకొట్టే తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసే పనిలో పడ్డారు. అదే సమయంలో బీజేపీ సీనియర్ నేత రాజ స్పందిస్తూ, సీమాన్‌తో తమకు భిన్న అభిప్రాయాలు ఉన్నా, పెరియార్‌ను ఆయన ధైర్యంగా వ్యతిరేకించడం నచ్చినట్టు వ్యాఖ్యానించారు. ఆయనకు ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ పేర్కొనడం గమనార్హం. నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు పోటీలో లేని దృష్ట్యా, సందడి అన్నది తగ్గినట్లయ్యింది. డీఎంకే అభ్యర్థి చంద్రకుమార్ ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. ఈనెల 17న ఆయన నామినేషన్ దాఖలుకు నిర్ణయించారు. ఇక నియోజకవర్గంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. కేరళకు చెందిన ఓ వ్యాపారి వస్త్రాల కొనుగోలుకు ఈరోడ్‌కు రాగా, ఎన్నికల అధికారులు ఆ నగదును సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment