ధనుష్, వెట్రిమారన్ కాంబోలో కొత్త చిత్రం
తమిళసినిమా: నటుడు ధనుష్,దర్శకుడు వెట్రిమారన్‌ది హిట్ కాంబినేషన్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం పొల్లాదవన్ మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత వచ్చిన ఆడుగళం, వడచైన్నె, అసురన్ చిత్రాలు సూపర్‌హిట్ అయ్యాయి. కాగా తదుపరి వడచైన్నె –2 రూపొందతుందనే ప్రచారం జరిగింది. దీంతో ఈ చిత్రం కోసం ధనుష్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూసిన తరుణంలో వడచైన్నె– 2 తెరకెక్కే అవకాశం లేదనే వార్త వారిని నిరాశకు గురి చేసింది. అయితే తాజాగా ధనుష్ అభిమానులకు పొంగల్ సందర్భంగా ఒక గుడ్ న్యూస్ వెలువడింది. తాజాగా నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ కలిసి మరో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారన్నదే ఆ న్యూస్. దర్శకుడు వెట్రిమారన్ కామెడీ నటుడు సూరిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన విడుదలై చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత దానికి సీక్వెల్‌గా విడుదలై – 2 చిత్రాన్ని చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం 25 రోజుల దాటి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాగా ఈ రెండు చిత్రాలను ఆర్‌ఎస్.ఇన్ఫోటెయిన్‌మెంట్ పతాకంపై ఎల్‌రెడ్.కుమార్ నిర్మించారు. ఈ చిత్రం 25 రోజుల పండగను జరుపుకుంటున్న నిర్మాత ఎల్ రెడ్.కుమార్ తమ తదుపరి చిత్రాల గురించి సోమవారం అధికారికంగా ప్రకటించారు. నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అంతకు ముందు నటుడు సూరి కథానాయకుడిగా చిత్రం చేయనున్నట్లు, ఈ చిత్రం ద్వారా వెట్రిమారన్ శిష్యుడు మదిమారన్ పుగళేందిని దర్శకుడిగా పరిచయం చేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ రెండు చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు నిర్మాత ఎల్‌రెడ్.కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment