సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ తెలంగాణలో ప్రవేశించింది. ఈ వేరియంట్ కేసులు రాష్ట్రంలో 3 నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు బుధవారం మీడియాకు తెలిపారు. ఇద్దరు హైదరాబాద్‌లో ఉండిపోగా, ఒకరు విమానాశ్రయం నుంచే పశ్చిమబెంగాల్‌కు వెళ్లిపోయారని చెప్పారు.
11, 12 తేదీల్లో నగరానికి..:
‘11న ఏడేళ్ల బాలుడితో సహా బెంగాల్‌కు చెందిన ఓ కుటుంబం కెన్యా నుంచి ఖతార్ మీదుగా హైదరాబాద్ వచ్చింది. విమానాశ్రయంలో ర్యాండమ్ పరీక్ష చేయగా బాలుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఆ కుటుంబం అట్నుంచి అటే పశ్చిమబెంగాల్‌కు వెళ్లిపోగా.. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో బాలుడికి ఒమిక్రాన్ సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఇలావుండగా కెన్యా, సోమాలియాకు చెందిన మరి కొందరు, ఈ నెల 12వ తేదీన వేర్వేరు విమానాల్లో అబుదబి మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారిలో కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళ, సోమాలియాకు చెందిన 23 ఏళ్ల పురుషుడు కూడా ఉన్నారు. వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. నమూనాలను హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ లేబరేటరీకి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా, ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. దీంతో వారిద్దరినీ గుర్తించి టిమ్స్‌లో చేర్పించాం..’అని శ్రీనివాసరావు తెలిపారు.
ఈ రెండూ రిస్క్ దేశాల జాబితాలో లేవు
‘ఇక బెంగాల్‌కు వెళ్లిన బాలుడికి సంబంధించిన వివరాలను అక్కడి ప్రభుత్వానికి పంపించాం. హైదరాబాద్‌లో ఉన్న ఇద్దరిలోనూ ఎలాంటి లక్షణాలూ లేవు. ఆరోగ్యంగానే ఉన్నారు. హైదరాబాద్‌లో దిగిన కెన్యా దేశస్థురాలు టోలిచౌకికి వెళ్లగా ఆమె అంకుల్, తండ్రికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించాం. పాజిటివ్‌గా తేలితే జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతాం. వారివారి ఇతర కాంటాక్టులను కూడా గుర్తిస్తున్నాం. కెన్యా, సోమాలియా ఒమిక్రాన్ రిస్క్ దేశాల జాబితాలో లేవు. కాగా ఒమిక్రాన్ ఆంక్షల అనంతరం రాష్ట్రానికి రిస్క్ దేశాల నుంచి మొత్తం 5,396 మంది వచ్చారు. అందులో 18 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా, 15 మందికి ఒమిక్రాన్ నెగటివ్‌గా తేలింది..’అని చెప్పారు.
నిర్లక్ష్యం వద్దు.. పరీక్షలు చేయించుకోండి
‘ప్రస్తుతం రోజువారీ చేస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలను 50 వేలకు పైగా పెంచుతాం. ఎవరికి ఎలాంటి లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ జలుబు, దగ్గు అని నిర్లక్ష్యం చేయవద్దు. కోవిడ్, జలుబు లక్షణాలతో ఒమిక్రాన్ ఉంటుంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందితే, సాధారణ లక్షణాలున్నా ఆసుపత్రులకు వెళ్లాల్సి రావొచ్చు. వ్యాక్సిన్ వేసుకున్నా ఒమిక్రాన్ సోకే అవకాశం ఉంది. అయితే సీరియస్ కాకుండా టీకా కాపాడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మాస్క్‌ల వాడకం 50 శాతానికి పెరిగింది..’అని తెలిపారు.
పండుగలు కుటుంబసభ్యుల మధ్యే జరుపుకోవాలి
‘నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో కూడా ఒమిక్రాన్ వెలుగు చూస్తున్నందున అన్ని దేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాల్సిన అవసరముందని కేంద్రానికి విన్నవించాం. జనవరి రెండో వారం నుంచి ఒమిక్రాన్ తీవ్రత పెరిగే అకాశం ఉంది. ఫిబ్రవరిలో మరింత తీవ్ర స్థాయికి చేరే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశాం. అందువల్ల కిస్మస్, కొత్త సంవత్సరం, సంకాంత్రి పండుగలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలి. ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎలాంటి వేరియంట్లు వచ్చినా లాక్‌డౌన్లు ఉండవు. అయితే అవసరమైనచోట ఆంక్షలు పెట్టే అవకాశముంది..’అని శ్రీనివాసరావు వివరించారు.
►మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. ఒమిక్రాన్ గాలి ద్వారా సోకుతుంది. చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. రెండు రోజుల్లోనే రెండింతలు వ్యాపించే
సామర్థ్యం దీనికి ఉంది. అయితే సోకిన వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నందున ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన పనిలేదు.
►మాస్క్‌ల వాడకం ద్వారానే ఒమిక్రాన్‌ను తిప్పికొట్టగలం. ఇంట్లోనూ బయట మాస్క్ ధరించాలి. భోజనం తినేటప్పుడు మాత్రమే మాస్క్ తీసేయాలి. తలుపులు, కిటికీలు తెరుచుకొని ఉండాలి. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment