సాక్షి, ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షల వేళ.. జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరీక్షలు మిస్ అయ్యాయననే మనస్థాపంతో ఓ విద్యార్థి బలవనర్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటు చేసుకుంది.
జైనథ్ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ అనే ఇంటర్ విద్యార్థి సాత్మల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరీక్షలు మిస్ చేసినందుకు తనను క్షమించాలంటూ తండ్రికి అతను రాసిన సూసైడ్ నోట్ లభించింది.
‘‘నాకోసం.. మీరు ఎంతో చేశారు.. మొదటిసారి పరీక్షకు హాజరు కాలేకపోయా. జీవితంలో ఇంతటి బాధ ఎప్పుడూ చవి చూడలేదు.. క్షమించు నాన్నా..’’ అని నోట్‌లో ఉంది
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఒక్క నిమిషం నిబంధన వల్లే..
ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్లోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కేంద్రంలో పరీక్షకు వెళ్లాడు శివ. అయితే.. అప్పటికే మూడు నిమిషాలు ఆలస్యం అయ్యింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా.. పరీక్షకు అనుమతించరాదనే నిబంధన ఉందని అధికారులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో శివ అక్కడి నుంచి వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే మనోవేదనతో.. తండ్రికి లేఖ రాసి సాత్నాల ప్రాజెక్టు డ్యాం లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీశారు.
సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ,విద్యార్థి చేతి వాచి,పెన్ను లభించింది. తండ్రికి రాసిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టించింది. ప్రభుత్వం పరీక్షకు హాజరయ్యేందుకు ఒక నిమిషం నిబంధన విధించిన కారణంగానే నిండు ప్రాణం బలైందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కష్టపడి చదివి.. ఆందోళనగా పరీక్షకు వెళ్లిన కొడుకు శవమై తిరిగొచ్చేసరికి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment