సాక్షి, నెట్‌వర్క్: కరోనా ఫస్ట్ వేవ్‌లో ఉమ్మడి పాలమూరు పరిధిలోని మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట ఐదు జిల్లాల్లో వైద్యులు, వైద్యారోగ్య సిబ్బంది 600 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇక సెకండ్‌వేవ్‌లో ఇప్పటికి 192 మంది కరోనా కోరల్లో చిక్కుకున్నారు. వీరిలో మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్‌తో పాటు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ తదితరులు ఉన్నారు. వీరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వైద్యులు, సిబ్బంది మళ్లీ యథావిధిగా రోగులకు సేవలందిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 2,450 మంది సిబ్బంది ఉండగా మొదటి వేవ్‌లో 170 మందికి కరోనా సోకింది. అలాగే సెకండ్ వేవ్‌లో 306 మందికి పాజిటివ్ రాగా ఇప్పటివరకు 290 మంది కోలుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలో మొదటి దశలో 234 మంది, సెకండ్ వేవ్‌లో 294 మంది వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇందులో ఓ వైద్యుడు, ఆశా కార్యకర్త, జూనియర్ అసిస్టెంట్ మృతి చెందారు. మిగతా వారు కోలుకుని వైద్య సేవలు అందిస్తున్నారు.పెద్దపల్లి జిల్లాలో మొత్తం 1,502 మంది వైద్యులు, సిబ్బంది ఉండగా 170 మందికి వైరస్ సోకింది. ఇద్దరు మృతి చెందారు. మిగతావారు కోలుకుని యథావిధిగా విధులు నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో జిల్లా వైద్యాధికారి మొదలు మొత్తం 800 మంది కోవిడ్ బారిన పడ్డారు. ఇందులో ఆశా కార్యకర్త ఒకరు చనిపోగా, మిగిలిన వారందరూ రికవరీ అనంతరం విధుల్లో చేరారు.
ములుగు జిల్లా మొదటి వేవ్‌లో 136 మందికి కరోనా సోకింది. ఒకరు చనిపోయారు. 135 మంది కోలుకొని విధులు నిర్వహిస్తున్నారు. సెకండ్ వేవ్‌లో 10 మందికి కరోనా సోకగా ఇప్పటికి ఐదుగురు కోలుకున్నారు. జనగామ జిల్లాలో మొదటి విడతలో 720 మంది, రెండో వేవ్‌లో 120 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం 20 మంది వరకు ఐసోలేషన్‌లో ఉండగా, మిగతా వారంతా కోలుకుని వైద్య సేవలు అందిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 600 మంది ఉద్యోగులు సిబ్బంది ఉన్నారు. ఇందులో మొదటి విడతలో 58 మంది, సెకండ్ వేవ్‌లో 54 మందికి పాజిటివ్ వచ్చినా కోలుకుని వైద్యసేవలు అందిస్తున్నారు.
అయితే ఇదే జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ ఎపిడమిక్ సెల్ ఎంపీహెచ్‌ఈఓ, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బూర రవి (54) బుధవారం మృత్యువాత పడ్డారు. వరంగల్ అర్బన్ జిల్లాలో మొదటి విడతలో 219 మంది, రెండో విడతలో 32 మంది కరోనా బారిన పడ్డారు. మొదటి విడత కరోనా సోకిన వారందరూ కోలుకుగా, రెండో విడతలోని కొందరు మాత్రం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, మహబూబాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, వికారాబాద్ జిల్లాల్లో కూడా అనేకమంది వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. కోలుకున్నాక తిరిగి విధులు నిర్వర్తిస్తున్నారు.
కుటుంబంలోని 10 మందికీ..
ఈమె పేరు డాక్టర్ క్రాంతి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం వైద్యాధికారిణిగా పనిచేస్తున్నారు. 2 నెలల క్రితం లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్ రిపోర్ట్ రావడం తో ఇంట్లో ఉండే 9 మంది కుటుంబసభ్యులకూటెస్టులు చేయించగా అందరికీ పాజిటివ్ వచ్చి ంది. అయినా ఎంతమాత్రం అధైర్య పడలేదు. 14 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండి ప్రభు త్వ మందులనే వాడి కుటుంబసభ్యులతో పాటు కోవిడ్‌ను జయించారు. ఇప్పుడు మళ్లీ వైద్యసేవలు కొనసాగిస్తున్నారు.
20 మంది పాజిటివ్‌లకు ప్రసవాలు
ఈమె డాక్టర్ ఒడ్నల రజిత. జగిత్యాల జిల్లా ఆస్పత్రిలో గైనకాలజిస్ట్. ఇప్పటివరకు పాజిటివ్ వచ్చిన 20 మంది గర్భిణులకు ప్రసవాలు చేశారు. తల్లుల నుంచి బిడ్డలకు కరోనా సోక కుండా కాపాడారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో కరోనా బారిన పడ్డారు. వారం రోజులకే కోలుకొని తిరిగి విధులకు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు పాజిటివ్ వచ్చిన గర్భిణులు సుమారు 20 మందికి ప్రసవాలు నిర్వహించాం. తల్లి నుంచి బిడ్డకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.
ఇంటిల్లిపాదీ కకావికలం..
గతేడాది జూలై 3న నాకు పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మూడు రోజులకు మా నాన్న హార్ట్‌ఎటాక్‌తో చనిపోయారు. అనంతరం మా ఇంటిల్లిపాదినీ కరోనా కకావికలం చేసింది. 80 శాతం ఊపిరితిత్తుల సమస్యతో నేను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా. అయితే మనోధైర్యమే నన్ను, నా కుటుంబాన్ని కాపాడింది. మళ్లీ విధుల్లో చేరి కరోనా బాధితులకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా.
– డాక్టర్ శశికాంత్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ,మహబూబ్‌నగర్
రెండుసార్లు కరోనా సోకినా..
నేను రెండుసార్లు కోవిడ్ బారినపడ్డా. గతేడాది అక్టోబర్‌లో ఒకసారి, ఈ ఏడాది జనవరిలో రెండోసారి ఆస్పత్రిలో చేరా. రెండోసారి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. నాతో పాటు మా అమ్మ, భార్య, పాప, బాబు, చెల్లె ఇలా ఇంటిల్లిపాదికీ పాజిటివ్ వచ్చింది. నేను కోలుకున్నా.. మా అమ్మను మాత్రం కాపాడుకోలేకపోయా. ఆమె హార్ట్ ఎటాక్‌తో కన్నుమూసింది. కొంతకాలం తర్వాత నేను మళ్లీ విధుల్లో చేరా.
– డాక్టర్ రామకిషన్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్, మహబూబ్‌నగర్
11 మంది మృత్యువాత
విధి నిర్వహణలో కరోనా సోకడంతో 11 మంది వైద్య సిబ్బంది మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు, నిజామాబాద్ జిల్లాలో ఓ వైద్యుడు సహా ముగ్గురు, పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు, నల్లగొండ, ములుగు, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు.
మొక్కవోని ధైర్యంతో ముందుకు
Published Fri, May 7 2021 2:33 AM | Last Updated on Fri, May 7 2021 2:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment