
సాక్షి,సిటీబ్యూరో: దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి ఆదరణ కరువైంది. రెండో విడతలో యూనిట్ల సంఖ్య పెరిగినా... నిరుద్యోగ యువత ఆసక్తి కరువైంది. దరఖాస్తులు ఆహా్వనిస్తే కనీసం కేటాయించిన యూనిట్లకు సరిపడ దరఖాస్తులు కూడా రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. మొదటి విడతలో అసెంబ్లీ నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేసి యూనిట్లను మంజూరు చేయడంతో గ్రౌండింగ్ కూడా పూర్తైంది.
నియోజవకవర్గానికి 1,100 యూనిట్లు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండో విడతలో ఒక్కో నియోజకవర్గంలో 1,100 చొప్పున యూనిట్లు కేటాయించారు. గత మూడు, నాలుగు నెలలుగా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు గాను 16, 500 యూనిట్లు కేటాయించగా, ఇప్పటి వరకు కేవలం 13 వేల దరఖాస్తులకు మించి రాలేదని తెలుస్తోంది. కొన్ని దరఖాస్తులు నేరుగా రాగా, మరికొన్నింటిని ఎమ్మెల్యేలు సిఫార్సు చేశారు. అయినప్పటికీ యూనిట్ల కేటాయింపునకు అనుగుణంగా దరఖాస్తుల సంఖ్య పెరగలేదు.
విచారణ అంతంతే...
రెండో విడత దరఖాస్తుల విచారణ సైతం అంతంత మాత్రంగా తయారైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ అధికారులతో సమీక్ష సమావేశాలు జరిపిన ప్రతిసారీ దళిత బంధు దరఖాస్తులపై విచారణ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నా.. ప్రక్రియ మాత్రం ముందుకు మాత్రం సాగడం లేదు. ఈ పథకం కింద యూనిట్‌కు రూ.10 లక్షల అందిస్తారు. అయినప్పటికీ దరఖాస్తుల తాకిడి లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment