సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ గణపతి వద్దకు దర్శనం నిలిపివేశారు. ఇప్పటి వరకు క్యూలైన్‌లో ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. ఇక, శోభాయాత్రకు ఖైరతాబాద్ గణపతి సిద్ధమవుతున్నాడు. ఈరోజు రాత్రి 12 గంటలకు గణపతికి చివరి పూజ ఉంటుంది. రేపు(గురువారం) ఉదయమే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఉంటుంది. ఈ నేపథ్యంలో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
కాగా, తలసాని మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయన్నారు. గణేశ్ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే అన్ని రహదారులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు అడ్డం లేకుండా తొలగించినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా అవసరమైన ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు చేపట్టడంతో పాటు 52వేల విద్యుత్ లైట్లను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భక్తులకు తాగునీటిని అందించడం 34 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశామన్నారు. ఇందుకోసం 122 స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విగ్రహాల నిమజ్జనం కోసం 125 స్టాండింగ్, 244 మొబైల్ మొత్తం 369 క్రేన్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 12 కిలోమీటర్ల మేర బారికేడింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 37 హెల్త్ క్యాంప్‌ల ఏర్పాటుతో అత్యవసర వైద్యసేవల కోసం 15 హాస్పిటల్స్‌లో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
శోభాయాత్ర, నిమజ్జనం జరిగే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసేందుకు 3వేల మంది పారిశుధ్య సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా చూసే 68 అడుగుల ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం 74 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామని, అలాగే 33 బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 200 మంది స్విమ్మర్లు, 5 బోట్లను కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమొద్దని సూచించారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం.. రెడ్ అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment