పంజగుట్ట: ‘రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో సీనియర్‌ను.. అనుభవం ఉన్న వాడిని. కాంగ్రెస్ పార్టీని ఎన్నో సంవత్సరాలుగా నాగర్‌కర్నూల్‌లో కాపాడుకుంటూ వస్తున్నా. నన్ను కాదని నిన్న, మొన్న వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారు?’అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కేవలం ఒక వ్యక్తి పార్టీలోకి వస్తే ఏదో జరిగిపోతుందని ప్రచారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొల్లాపూర్‌లో జగదీశ్వర్‌రావు పార్టీని కాపాడుతుంటే పార్టీలోకి కొత్తగా వచ్చిన జూపల్లి కృష్ణారావు... కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, గద్వాల సీట్లు తన వారికే కావాలంటున్నాడని, ఆయన అంత పెద్ద నాయకుడు ఎప్పుడయ్యాడో అర్థం కావడంలేదన్నారు. ఇన్ని సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ కేడర్‌కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉండి, ఏ ఎన్నికలు వచ్చినా ముందుండి పార్టీని నడిపిన మేము ఏం కావాలి? ఆయన గెలిచిన తర్వాత ఇక్కడే పార్టీలోనే ఉంటారన్న నమ్మకం ఉందా..ఆ గ్యారెంటీ ఎవరిస్తారని నాగం ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి...
కాగ్ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 48 వేల కోట్ల అవినీతి జరిగిందని నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉండగా సీఎం కేసీఆర్ దాన్ని పక్కన పెట్టేశారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ, ప్రతి పార్టీ అవినీతి గురించి మాట్లాడుతోందని, అయితే ఎవరూ ప్రశ్నించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు, టీపీసీసీ అధ్యక్షుడు దీనిపై తాడోపేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై త్వరలోనే ఏసీబీ డీజీని కలసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment