సాక్షి, హైదరాబాద్: గవర్నర్, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న విభేదాలు కొత్త పరిణామాలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా తమిళిసై, రాష్ట్ర సర్కారు.. ఉప్పు, నిప్పు అన్నట్టుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గవర్నర్‌ను విశ్వవిద్యాలయాల చాన్స్‌లర్ పదవి నుంచి తప్పించే యో చనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు బిల్లు పెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
డిసెంబర్‌లో వారం రోజులపాటు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని, ఆర్థికంగా అష్ట దిగ్బంధనం చేయడా న్ని ఎండగట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి ఈనెల 4న మహబూబ్‌నగర్, 7న జగిత్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను, కలెక్టరేట్ భవనాలను ప్రారంభించనున్నారు. 8న కరీంనగర్‌లో మాజీ మేయర్ రవీందర్‌సింగ్ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. అలాగే 9న మైండ్‌స్పేస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోరైలుకు శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంది.
మరోవైపు డిసెంబర్ రెండో వారంలో పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నందున ఎమ్మెల్యేలు, మంత్రులు తమతమ నియోజక వర్గాల్లో బిజీగా ఉండే అవకాశముంది. వీటన్నిటి దృష్ట్యా మూడోవారంలో అసెంబ్లీ నిర్వహించవచ్చని చెబుతున్నారు. ఈ భేటీలు 5 రోజులు జరిపే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ వ్యవహారశైలిపై కూడా చర్చించాలనే అభిప్రాయంతో సర్కారు ఉన్నట్లు టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం.
కాగా వర్సిటీల చాన్సలర్ పదవి నుంచి గవర్నర్‌ను తప్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం పొందినా, దానిపై సంతకం చేయాల్సింది గవర్నరే కావడం విశేషం. ఒకవేళ గవర్నర్ ఆమోదించకపోయినా.. గవర్నర్ వ్యవహారశైలిపై నిరసన వ్యక్తం చేసినట్లుగా శాసనసభ రికార్డుల్లో ఉంటుందనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు
సమాచారం.
గవర్నర్ వద్ద పెండింగ్‌లో బిల్లులు
విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్రస్థాయిలో బోర్డు ఏర్పాటును శాసనసభ ఆమోదించగా.. గవర్నర్ దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి వెళ్లి గవర్నర్‌కు వివరణ ఇచ్చారు. ఈ తతంగం గడిచి దాదాపు పక్షం రోజులు దాటినా ఆమోదించడం లేదా తిరస్కరించడం ఇప్పటివరకు జరగలేదు.
అలాగే ములుగు ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రిని చాన్స్‌లర్‌గా నియమించే బిల్లును కూడా గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచడం గమనార్హం. కాగా ఇటీవలే కేరళ ప్రభుత్వం కూడా చాన్స్‌లర్ పదవి నుంచి గవర్నర్‌ను తప్పించేందుకు ఏకంగా ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. అయితే అది ఇంకా ఆమోదం పొందలేదు.
Comments
Please login to add a commentAdd a comment