బంజారాహిల్స్ (హైదరాబాద్): రాష్ట్రంలోని అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత కూడా తమదేనన్నారు. ఆ తండాలకు పంచాయతీ భవనాలను నిర్మిస్తామన్నారు. గురువారమిక్కడి బంజారాభవన్‌లో గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాల్లో రేవంత్ మాట్లాడారు.
విద్యుత్, మంచినీరు... ఇలా ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, అన్ని నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. బంజారా సోదరులతో ఈ సమావేశం నిర్వహిస్తుంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలిసినంత ఆనందంగా ఉందని చెప్పారు. 1976లో బంజారాలను ఎస్టీ జాబితాలో ఇందిరాగాంధీ చేర్చారని, ఆ తర్వాత దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియాగాందీదేనన్నారు.
మీ ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, సేవాలాల్ జయంతిని ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ఇచ్చిందని చెప్పారు. జయంతి ఉత్సవాల నిర్వహణకు రూ.కోటి కాదు.. మరో కోటి జత చేసి రూ.2 కోట్లు విడుదల చేస్తున్నామని, తక్షణమే దీనికి సంబంధించిన జీఓను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి కె.జానారెడ్డి, బలరాంనాయక్, రాములునాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పి.విజయారెడ్డి, బంజారా సంఘ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment