తిరుపతి కల్చరల్: ‘జీవితంలో రాణించాలంటే పట్టుదల ఉండాలి. సడలని సంకల్పంతో ముందుకు సాగాలి. అవరోధాలు ఎదురైనా..కష్టాలు వెంటాడుతున్నా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాలి. విజయం చేకూరేవరకు కష్టాలు..కన్నీళ్లు దిగమింగుతూనే ఉండాలి’ అంటాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. అచ్చం ఆయన జీవితం అలాగే కొనసాగిందని తన బంధువులు చెప్పుకొస్తున్నారు. సినిమా రంగంలో వందలాది చిత్రాలకు కొరియో గ్రాఫర్‌గా పనిచేసిన రాకేష్ మాస్టర్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషాద వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఆయన జ్ఞాపకాలు తలుచుకుని స్నేహితులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.
రాకేష్ మాస్టర్‌ది తిరుపతే
రాకేష్‌మాస్టర్ తిరుపతిలోని బండ్ల వీఽధిలో 1960లో జన్మించారు. ఆయనకు పద్మావతి, అరుణ, విజయ, లక్ష్మి అనే సోదరిలతోపాటు అన్న కోటేశ్వరరావు, తమ్ముడు కృష్ణారావు ఉన్నారు. వీరు ప్రస్తుతం డీఆర్ మహల్ రోడ్డులోని ఎస్బీఐ కాలనీలో నివాసముంటున్నారు.
బ్రూస్‌లీ స్ఫూర్తి
హాలీవుడ్ నటుడు బ్రూస్‌లీ అంటే రాకేష్‌మాస్టర్‌కు ఇష్టం. ఆయన స్ఫూర్తితో కరాటే, జిమ్నాస్టిక్ నేర్చుకున్నారు. తిరుపతిలో అనేక నృత్య ప్రదర్శనలు చేశారు. తన ఆకాంక్ష నేరవేర్చుకోవాలనే తపనతో 1996లో చైన్నెకి వెళ్లి సినీ రంగంలో చేరే ప్రయత్నం చేశారు. ప్రయత్నాలు విఫలం కావడంతో తిరిగి తిరుపతికి చేరుకొని ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో భరతనాట్యం అభ్యసించారు. మిత్రుల ప్రోత్సాహంతో మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లి సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్‌గా స్థిరపడ్డారు. సుమారు 350 సినిమాలకుపైగా పనిచేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సైతంఈయన శిష్యుడే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment