క్షేమంగా వెళ్లిరండి
తిరుపతి అర్బన్: ‘అలిపిరి డిపోకు చెందిన సర్వీసుల్లో 92 శాతం తిరుమల ఘాట్‌లో నడుస్తున్నాయి.. మీరంతా క్షేమంగా వెళ్లిరండి’ అంటూ డిపో మేనేజర్ హరిబాబు డ్రైవర్లకు రోజా ఫ్లవర్స్‌ను అందించారు. రోడ్డు భద్రతా వాసోత్సవాల్లో భాగంగా అలిరిపి డిపోలో డ్రైవర్లతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చిపోతున్న విషయాన్ని గుర్తుచేశారు. వారితో మర్యాదగా మాట్లాడాలని చెప్పారు. తిరుపతితోపాటు తిరుమలలో రిక్వెస్ట్ స్టాపింగ్‌ను భక్తులు కోరితే...ట్రాఫిక్ సమస్యలను గుర్తించి వారి అవసరాల నిమిత్తం స్టాపింగ్ చేయాలన్నారు.. డ్యూటీకి వస్తే విధులపైనే దృష్టి సారించాలని, అంతేతప్ప ఇంట్లో సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలపై ఆలోచన చేస్తే వచ్చే ఇబ్బందులను గుర్తుచేశారు. అలాగే ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ రూల్స్‌ను విధిగా పాటింటాలని చెప్పారు. వారితోపాటు అసిస్టెంట్ మేనేజర్ పుష్పలత, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రభాకర్, పలువురు సూపర్ వైజర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 15 కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి వరకు 56,225 మంది స్వామివారిని దర్శించుకోగా 19,588 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.95 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
ఐసీడీఎస్ పీడీగా వసంతాబాయ్
తిరుపతి అర్బన్: తిరుపతి జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వసంతాబాయ్‌ని నియమిస్తూ ఆ విభాగానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి సూర్యకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. వైఎస్సార్ జిల్లాలోని ఐసీడీఎస్ పరిధిలో వేర్‌హౌస్ రీజనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆమెను తిరుపతికి బదిలీ చేశారు. ఈ మేరకు ఆమె రెండు మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న జయలక్ష్మికి రెండు రోజుల క్రితం పదోన్నతి కల్పించి ఒంగోలు ఆర్జేడీగా బదిలీ చేశారు. వంసతబాయ్ వచ్చిన తర్వాత జయలక్ష్మి రిలీవ్ కానున్నారు.
విద్యతోనే సమాజాభివృద్ధి
తిరుపతి ఎడ్యుకేషన్ : విద్యతోనే వ్యక్తిగత, సమాజాభివృద్ధి సాధ్యమని ఆర్‌ఎస్ మాడ వీధి నగరపాలక హైస్కూల్ హెచ్‌ఎం రేవతి అన్నారు. జాతీయ బాలిక దినోత్సవం, అంతర్జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆ స్కూల్‌లో గిరిజన నవ సమాజ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సమాజంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను స్ఫూర్తిగా తీసుకుని బాలికలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని హెచ్‌ఎం ఆకాంక్షించారు. అనంతరం గిరిజన నవ సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివశంకర్ నాయక్ మాట్లాడారు. ఆ తర్వాత పదో తరగతి విద్యార్థులు 45 మందికి బిట్ బ్యాంక్, స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.కార్యక్రమంలో గిరిజన నవ సమాజ్ విద్యార్థి విభాగం నాయకులు బాలు నాయక్, సురేంద్ర, ఉపాధ్యాయులు కవిత, వాణి, శ్రీలేఖ, బాలు, చౌదరీబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.
4న శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రథసప్తమి
తిరుపతి కల్చరల్: నారాయణవనం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమి సూర్య జయంతిని పురస్కరించుకుని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథసప్తమి నిర్వహించడం ఆనవాయితీ. ఆ రోజు ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామివారి లలాటపలకం, నాభి, పాద కమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు వేయికళ్లతో ఎదురుస్తూంటారు. స్వామి, అమ్మవార్లు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment