సమగ్ర సర్వేకు సహకరించండి
పూడూరు: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే దోహద పడుతుందని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. గురువారం మండలంలోని చెంచుపల్లిలో సర్వే ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికా రుల దృష్టికి తెచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వే కోసం గ్రామాలకు వచ్చే అధికారులకు పూర్తి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. ఇంటి యజమాని ఇచ్చిన వివరాలను మాత్రమే ప్రొఫార్మాలో పొందుపరచాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా వివ రాలు నమోదు చేయాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. గ్రామంలో భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. పట్టాదారు పాసుపుస్తకాల సమస్యలు, ఇతర భూ సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని రైతులకు సూచించారు. గ్రామంలో విద్యుత్ తీగలు కిందకు ఉన్నాయని ప్రజలు కలెక్టర్‌కు తెలియజేశారు. స్పందించిన ఆయన వెంటనే సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు. అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. సమస్యలు, పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పెన్నులు, నోటు పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, తహసీల్దార్ భరత్, ఎంపీడీఓ పాండు, అంగన్‌వాడీ టీచర్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment