కల్తీ కల్లు.. ఆరోగ్యానికి చిల్లు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలో ‘కల్తీ’ కల్లు మాఫియా రెచ్చిపోతోంది. మోతాదుకు మించి రసాయనాలు కలిపి తయారు చేస్తున్న ఈ కల్లును తాగుతున్న అమాయక కూలీలు, పేదలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కల్లు అమ్మకాలపై తనిఖీలు నిర్వహించి పరీక్షలు నిర్వహించాల్సిన శంషాబాద్, సరూర్‌నగర్ అబ్కారీ అధికారులు వారిచ్చే ముడుపులు పుచ్చుకుని కిమ్మనడం లేదనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ఇటీవల మీర్‌పేటలోని నందనవనం బస్తీకి చెందిన ఓ మహిళ కల్తీకల్లు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మోతాదుకు మించి రసాయనాలు కలిపి, కల్తీ కల్లును తయారు చేసి ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న కల్తీకల్లు మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన ఎకై ్సజ్‌శాఖ వారికి అండగా నిలుస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బస్తీలే కల్లు కాంపౌండ్లకు అడ్డాలు
పకృతి సిద్ధమైన తాటి, ఈత చెట్ల నుంచి తీసిన కల్లు ఆరోగ్యకరమైంది. స్వచ్ఛమైన ఈ కల్లును సేవించడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు సైతం తొలగుతాయి. సాధారణంగా చెట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల కల్తీ తక్కువ. డిమాండ్ మేరకు ఉత్పత్తి లేకపోవడం, అప్పటి వరకు ఈ వృత్తిపై ఆధారపడిన గీత కార్మికులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఫలితంగా కల్లుకు కొరత ఏర్పడింది. గుడుంబా దొరక్క పోవడం, మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో రోజువారీ కూలీలు కృత్రిమంగా లభించే కల్లుకు అలవాటుపడుతున్నారు. ప్రజల్లోని ఈ బలహీనతను కొంత మంది కల్లు వ్యాపారులు సొమ్ము చేసుకుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో క్లోరోహైడ్రేట్, డైజోఫామ్, ఆల్పాజోలమ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను వినియోగించి కల్తీ కల్లును తయారు చేస్తున్నారు. తయారీలో మోతాదుకు మించి రసాయనాలను వినియోగిస్తుండడంతో దీన్ని సేవించిన వారు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. శంషాబాద్, రాజీవ్‌శెట్టినగర్, మీర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, బొంగుళూరుగేటు, ఆదిబట్ల, యాచారం, చేవెళ్ల, షాద్‌నగర్, షాబాద్, కడ్తాల్ శివారు ప్రాంతాల్లో ఈ కల్తీ కల్లు విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిజానికి ప్రస్తుత సీజన్‌లో తాటి చెట్లకు ఆశించిన స్థాయిలో కల్లు ఉత్పత్తి కాదు. ఒకటి రెండు తాటి చెట్ల నుంచి కల్లును సేకరించినా, ఇది వారి సొంత అవసరాలకు కూడా సరిపోదు. కానీ జిల్లాలోని ఏ ప్రధాన రోడ్డు వెంట చూసినా కృత్రిమ కల్లు దుకాణాలే దర్శనమిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, నమూనాలు సేకరించాల్సిన ఎకై ్సజ్ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై అనేక విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
ఒక లైసెన్సు.. రెండు దుకాణాలు
శంషాబాద్ పట్టణంలోని ఓ ప్రధాన కల్లు దుకాణంలో సభ్యుల మధ్య జరిగిన గొడవతో కల్లు విక్రయాలు రోడ్డుపైకి వచ్చాయి. గొడవల కారణంగా దాదాపు నెల రోజులుగా దుకాణం తెరవని విక్రయదారులు తమ దందాను మాత్రం యథేచ్చగా రోడ్డెక్కించారు. దాదాపు మూడు వందల సభ్యులతో ఉన్న ఈ దుకాణంలో కొంత కాలంగా వ్యాపారుల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఓకే దుకాణంలో రెండు వేర్వేరు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఎకై ్సజ్ నిబంధనల మేరకు ఒక లైసెన్స్‌పై రెండు విక్రయ కేంద్రాలు నడిపిస్తున్న విషయం తెలుసుకున్న ఆబ్కారీ అధికారులు ఒక లైసెన్స్‌పై ఒకటే దుకాణం నడిపిచాలని హెచ్చరించారు. వ్యాపారులు మాత్రం ఇదేమి పట్టనట్టుగా దందా కొనసాగిస్తున్నారు. రైల్వేస్టేషన్ నుంచి వీకర్ సెక్షన్ కాలనీ మీదుగా ఉన్న రోడ్డుపైనే కల్లు విక్రయాలు జరుపుతుండటంతో కాలనీ వాసులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేదు.
క్లోరోహైడ్రేట్, డైజోఫామ్, ఆల్పాజోలమ్‌లతో కల్లు తయారీ
మోతాదుకు మించి రసాయనాలు కలపడంతో ప్రమాదం
పట్టించుకోని జిల్లా ఎకై ్సజ్ అధికారులు
మామూళ్ల మత్తులో జోగుతున్న వైనం
నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది
డైజోఫాం ఇతర రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ కల్లును సేవించిన వారిలో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. నీరసం, ఒంటి నొప్పులతో పాటు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. మానసిక విక్షణ కోల్పోయి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఈ సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలకే ప్రమాదం. ఈ క్షతగాత్రులకు సర్జరీల సమయంలో నొప్పి నివారణ కోసం ఇచ్చే మత్తు ఇంజక్షన్లు సైతం పని చేయవు. మోతాదుకు మించిన డోసు ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ కల్లును సేవించక పోవడమే ఉత్తమం.
– డాక్టర్ రాజేశ్, న్యూరో సర్జన్
Comments
Please login to add a commentAdd a comment