ప్రభుత్వానికి సహకరించాలి
● ప్రజాపాలన విజయోత్సవాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ● హాజరైన అధికారులు,ప్రజాప్రతినిధులు
కొడంగల్: మన మంచి కోసం.. మన బిడ్డల భవిష్యత్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని రాఘవేంద్ర గార్డెన్స్‌లో ప్రజా పాలన విజయోత్సవాలను జిల్లా అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఒక కుటుంబం అధికార, ధన దాహానికి తెలంగాణ ఆగమైందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు జేసి ఆగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకునే కాంగ్రెస్‌కు పట్టం కట్టారన్నారు. నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. పేదలు, రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల బాగు కోసం పని చేస్తున్నామని చెఏప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తి అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేశామని గుర్తు చేశారు. రూ.500కు వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ట్రెయినీ కలెక్టర్ ఉమా హారతి, సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ అలేఖ్య పుంజాల, ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేశ్, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఉషారాణి, ఏఎమ్‌సీ చైర్మన్ అంబయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆటపాటలు ఆహుతులను అలరించాయి.
18 కెజిడిజిఎల్ 05 :
Comments
Please login to add a commentAdd a comment