భూములిచ్చేది లేదు
● ఫ్యూచర్ సిటీ రహదారి భూ బాధితుల తీర్మానం ● భూమికి భూమి ఇచ్చి తీరాల్సిందే ● లేదంటే మార్కెట్ ధర ప్రకారంపరిహారం చెల్లించాలి ● తేల్చి చెప్పిన రైతులు
కందుకూరు: ఫ్యూచర్ సిటీ రహదారి నిర్మాణం కో సం భూములు ఇచ్చేది లేదని బాధిత రైతులు తేల్చి చెప్పారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ గోపాల్‌కు వినతిపత్రాలు అందించారు. అంతకు ముందు రాచలూరులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న వారందరినీ ఒప్పించిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని తీర్మానించారు. కందుకూరు, యాచారం, కడ్తాల్ మండలాల్లో గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ప్రస్తుత ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మించడానికి సిద్ధమైంది. అందుకు సంబంధించి ఓఆర్‌ఆర్ 13 ఎగ్జిట్ నుంచి బేగరికంచె పరిధిలో నిర్మిస్తున్న స్కిల్స్ యూనివర్సిటీ వరకు తొలి విడతలో 300 అడుగుల రహదారి నిర్మించడానికి భూసేకరణ చేపట్టింది. ఇటీవల గ్రామాలు,సర్వే నంబర్ల వారీగా ఏయే భూముల నుంచి ఎంత మేర సేకరించనుందో ప్రకటించింది. రెండు రోజులుగా రెవెన్యూ అధికారులు ఆయా భూముల్లో సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసే పనులు చేపట్టారు. పనులు చేస్తున్న అధికారులను ఇటీవల రాచులూరు రెవెన్యూలో రైతులు అడ్డుకున్న విషయం విధితమే.
నష్టపోకుండా చూడాలి
శ్రీశైలం రహదారిని విస్తరించి గతంలో కొత్తూరు గేట్ నుంచి నిర్మించిన 200 అడుగుల రహదారిని ఉపయోగించుకోవచ్చని సూచించారు. దీంతో తాము భూములు కోల్పోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం రైతులంతా నష్టపోకుండా ప్రభుత్వం ఆలోచించాలన్నారు. తమ పొలాలు ఇవ్వడానికి ఎవరూ సుముఖంగా లేరని స్పష్టం చేశారు. భూమికి భూమి లేదంటే ప్రస్తుతం మార్కెట్‌లో ఎకరం రూ.4కోట్ల నుంచి రూ.5 కోట్లు ధర పలుకుతోందని.. దాని ప్రకారం పరిహారమా అనేది రైతులను ఒప్పించి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment