డాబాగార్డెన్స్: ప్రజలకు మెరుగైన సేవలతో పాటు ప్రపంచ ఖ్యాతే లక్ష్యంగా విశాఖ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. 2024లో మరిన్ని మెరుగైన ప్రాజెక్టుల అభివృద్ధికి జీవీఎంసీ కృషి చేస్తుందని కమిషనర్ తెలిపారు.
పారిశుధ్య పనుల నిర్వహణకు చర్యలు
మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా నగరంలో పారిశుధ్యం పనుల నిర్వహణకు చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. జీవీఎంసీ కార్మికుల అవసరాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సమ్మె కాలంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, నగర పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణ దిశగా తమ వంతు బాధ్యతగా జీవీఎంసీ ఏర్పాటు చేసిన డంపర బిన్‌లలో వ్యర్థాలు వేయాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకల్లో డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, జీవీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, పలువురు కార్పొరేటర్లు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మేయర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు
మేయర్ గొలగాని హరివెంకటకుమారిని సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కలిసిన పలువురు కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లు, జీవీఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్లు, సిబ్బంది, పలు సంఘాల ప్రతినిధులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను మేయర్ ఆవిష్కరించారు. యూనియన్ అధ్యక్షుడు వీవీ వామనరావు, గుమ్మడి నరసింగరావు, కారె ఎల్లయ్య, డొక్కర పోలరావు, వెంకునాయుడు, తాతారావు, వెంకట్రావు, ఎల్లారావు, సూరిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment