మధ్యాహ్న భోజన కార్మికులకు తీరని అన్యాయం
సీఐటీయూ నేతల ఆందోళన
సీతమ్మధార: రాష్ట్ర బడ్జెట్‌లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని మధ్యాహ్న భోజన కార్మికులు మండిపడ్డారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిటు నేతలు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు రాజకీయ వేధింపులు ఆపాలని, వేతనాలు, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలని, అక్షయపాత్రలో పనిచేసే కార్మికులకు రాగి జావ వండినందుకు అదనపు వేతనం చెల్లించాలని, బకాయి జీతాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని, గుర్తింపు కార్డులు, యూనిఫాంలు ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని, వంట వండేటప్పుడు, వడ్డించేటప్పుడు ప్రమాదానికి గురైతే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాల పెంచకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలనే డిమాండ్ గురించి ఏమాత్రం మాట్లాడకపోవడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీని విస్మరించడం బాధ కలిగిస్తోందన్నారు. యూనియన్ అధ్యక్షురాలు భవాని, ప్రధాన కార్యదర్శి జి.మంగశ్రీ, యూనియన్ జిల్లా నాయకులు వరలక్ష్మి, ఆదిలక్ష్మి, వై.ధనలక్ష్మి, పి.చిన్నతల్లి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పి.మణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment