మహారాణిపేట : నీటి సంఘాల ఎన్నిక ప్రక్రియపై అధికారులందరూ సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 23న జరగనున్న నీటి సంఘాల ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే ఈవో, ఏఈవో, పీవో, ఏపీవోలకు కలెక్టరేట్‌లో మంగళవారం ఒక్క రోజు శిక్షణ సదస్సు నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్లు వి.చిన్నంనాయుడు, ఆర్.సురేష్‌కుమార్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. గత అనుభవాలు, ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. సదస్సులో భాగంగా కలెక్టర్ పలు అంశాలపై సూచనలు చేశారు. భీమిలి, ఆనందపురం, పెందుర్తి, పద్మనాభం మండలాల పరిధిలో మొత్తం 29 నీటి సంఘాలకు ఈ నెల 23వ తేదీన ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని, అందరూ సంసిద్ధంగా ఉండాలని సూచించారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఏకగ్రీవం లేదా చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎన్నిక ప్రక్రియ ఉంటుంది కాబట్టి.. రైతులకు అన్ని అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, నీటి పారుదల శాఖ అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సూచన
Comments
Please login to add a commentAdd a comment