బదిలీల్లో అవినీతి.. విచారణకు మోకాలడ్డు
● ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈవోపీఆర్డీల బదిలీల్లో అక్రమాలు ● ‘సాక్షి’ వరుస కథనాలతో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ● రెండు సార్లు నోటిసులిచ్చినా హాజరుకాని అనకాపల్లి డీపీవో ● తాజాగా విచారణాధికారి పరిధి కుదింపు
మహారాణిపేట: పంచాయతీరాజ్ శాఖలో అడ్డగోలు బదిలీల వ్యవహారంలో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అక్రమ బదిలీల ఆరోపణలు ఉన్న జిల్లాలను విచారణకు మినహాయింపు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కూటమి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగా అడ్డగోలు బదిలీల వ్యవహారం వెలుగులోకి రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పంచాయతీ కార్యనిర్వహణాధికారి అండ్ రూరల్ డెవలప్‌మెంట్(ఈవోపీఆర్డీ) బదిలీలపై విచారణ చేస్తున్న జెడ్పీ సీఈవో పరిధి కుదించడమే ఇందుకు నిదర్శనం.
ఉమ్మడి విశాఖ జిల్లాలో సెప్టెంబర్ 22న ఈవోపీఆర్డీల బదిలీ ప్రక్రియను చేపట్టారు. ఇందులో కూట మి ప్రజాప్రతినిధుల సిఫార్సులకు పెద్ద పీట వేశారు. అలాగే కొంత మంది ఉన్నతాధికారులు భారీ ముడుపులు తీసుకుని కొందరికి స్థానచలనం కలిగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కొంత మంది ఏకంగా ఆన్‌లైన్ ద్వారానే చెల్లింపులు చేసినట్లు సమాచారం. దీనిపై ఉద్యోగులు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. ఏళ్ల తరబడి గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు ఈ బదిలీలతో మైదాన ప్రాంతాల్లోకి రావచ్చని ఆశపడ్డారు. అయితే సిఫార్సులు, ముడుపులు కారణంగా వారు గిరిజన ప్రాంతాలకే పరిమితమయ్యారు. బదిలీ ప్రక్రియలో భారీగా డబ్బు చేతులు మారడం కారణంగానే తమకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
విచారణకు సహకరించని అధికారులు
కలెక్టర్ ఆదేశాల మేరకు జెడ్పీ సీఈవో విచారణ ప్రారంభించారు. అయితే అనకాపల్లి, అల్లూరి జిల్లాల పంచాయతీ అధికారుల నుంచి ఎటువంటి సహకారం అందలేదని తెలిసింది. బదిలీ విషయంలో విచారణకు హాజరుకావాలని ఆ జిల్లాల పంచాయతీ అధికారులకు సీఈవో నోటీసులు జారీ చేశారు. అయితే వారు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. బదిలీల కోసం వచ్చిన దరఖాస్తులు, తీసుకున్న నిర్ణయాల నివేదికలు కావాలని అడిగినా వారు స్పందించలేదు. దీంతో సీఈవో స్వయంగా ఆయా జిల్లాలకు వెళ్లి సమా చారం సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలా వివరాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడి అధికారులు తమ జిల్లాలో తలదూర్చవద్దని.. విశాఖ జిల్లాలో మాత్రమే విచారణ చేసుకోవాలని చెప్పడంతో సీఈవో నిర్ఘాంతపోయినట్లు తెలిసింది.
మినహాయింపుపై అనుమానాలు
కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేస్తున్న సీఈవోపై కూటమి ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా అనకాపల్లి, అల్లూరి జిల్లాలను విచారణ నుంచి మినహాయించేలా ప్రభుత్వంతోనే చెప్పించడం గమనార్హం. దీంతో అక్రమ బదిలీల వ్యవహారంలో అనకాపల్లి, అల్లూరి జిల్లాలను మినహాయిస్తూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. విచారణాధికారి పరిధిని కేవలం విశాఖకు మాత్రమే పరిమతం చేశారు.
‘సాక్షి’ కథనాలతో ప్రభుత్వంలో కదలిక
సెప్టెంబర్ 22వ తేదీనే బదిలీల ప్రక్రియను చేపట్టినప్పటికీ.. ఆ జాబితాను ఆ నెల 30వ తేదీ వరకు రహస్యంగా ఉంచడంపై అనేక ఆరోపణలు వినిపించాయి. కేవలం ఈవోపీఆర్డీలకు మెయిల్ పెట్టి చేతులు దులిపేసుకున్నారు. ఈ వ్యవహారం మీద పలువురు ఈవోపీఆర్డీలు విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్‌ను కలిసి ఫిర్యాదులు చేశారు. దీనిపై సాక్షి వరస కథనాలు ప్రచురించడంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ఈ బదిలీలపై విచారణ జరిపించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. విచారణాధికారిగా జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తిని కలెక్టర్ నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment