చట్టాలు, హక్కులపై అవగాహన అవసరం
● నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ● ఎస్సీ, ఎస్టీ (పీవోఏ) చట్టంపై అవగాహన సదస్సు
ఏయూక్యాంపస్: చట్టాలు, హక్కులపై అవగాహన కలిగి ఉంటే.. మనల్ని మనం పరిరక్షించుకోవడం సులువని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. బీచ్‌రోడ్డులోని ఏయూ సాగరిక కన్వెన్షన్ సెంటర్‌లో క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(సీఐడీ) ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ (పీవోఏ) చట్టంపై శనివారం అవగాహన సదస్సు జరిగింది. ముందుగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ‘విద్య, అవగాహనతో షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీల సాధికారత’అంశంపై యువతనుద్దేశించి మాట్లాడారు. చట్టాలపై అవగాహన ఉంటే.. చట్టాలను ఉల్లఘించే వారికి గుర్తించడం సాధ్యపడుతుందన్నారు. షెడ్యూల్ తెగల పరిరక్షణ, సంరక్షణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక చట్టాలను ప్రతీ పౌరుడు తెలుసుకోవాలని సూచించారు. ఆదివాసీ చట్టాలు, అటవీ చట్టం 2006 తదితర అంశాలపై నిపుణులు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఎస్టీలకు అవసరమైన సంపూర్ణ సహకారం, భద్రత, భరోసా అందించడానికి తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామన్నారు. ఆదివాసీ యువత బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఒడిశాలోని ఆదివాసీ ప్రాంతంలో జన్మించిన మహిళ నేడు మన రాష్ట్రపతిగా సేవలందిస్తున్నారని.. ద్రౌపది ముర్ము వంటి వారిని యువతరం స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలని పిలుపునిచ్చారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.రామారావు మాట్లాడుతూ సమాజానికి చైతన్య దీపికలుగా యువతరం నిలవాలన్నారు. చైతన్యం లేని చోట దోపిడీ ప్రబలుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం రూపకల్పన, అమలు, శిక్షలు తదితర అంశాలను విపులీకరించారు. అట్రాసిటీ చట్టం పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, న్యాయస్థానాలు చేస్తున్న కృషిని వివరించారు. విశాఖ జిల్లాలో అట్రాసిటీ కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయన్నారు. ఏయూ న్యాయ కళాశాల ఆచార్యులు చంద్రకళ మాట్లాడుతూ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయన్నారు. సమాజానికి యువతే ఆయుధమన్నారు. సామాజిక, ఆర్థిక న్యాయం అందరికీ చేరువ కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, ఆర్వో(సీఐడీ) డాక్టర్ ప్రేమ్ కాజల్, ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు, ఏడీసీపీ(క్రైం) ఎం.మోహనరావు, విజిలెన్స్ మానటరింగ్ కమిటీ సభ్యులు ఎన్.మాధవి, పి.మల్లేశ్వరరావు, శామ్యూల్, రాజబాబు, పూర్వ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమ్మి శ్రీనివాసరావు, న్యాయవాది పాకా సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment