హోటళ్లు ఫుల్.. అనుమతులు నిల్
● నగరంలో జీఎస్టీ, ట్రేడ్ లైసెన్సులులేకుండా హోటళ్లు, లాడ్జీల నిర్వహణ ● 80 బృందాలతో 81 హోటళ్లు, లాడ్జీలు, 5 హాస్టళ్లలో తనిఖీలు ● 47 హోటళ్లు, లాడ్జీలకు ఫైర్ ఎన్‌వోసీలు లేనట్లు గుర్తింపు ● 22 హోటళ్లకు జీఎస్టీ, 11 హోటళ్లకు ట్రేడ్ లైసెన్సులు లేనట్లు నిర్ధారణ
విశాఖ సిటీ: నగరంలోని హోటళ్లు, లాడ్జిల్లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో విస్తపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అనేక హోటళ్లు, లాడ్జీలు జీఎస్టీ, ట్రేడ్ లైసెన్సు లేకుండా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న విషయం బహిర్గతమైంది. ప్రధానంగా అనేక హోటళ్లకు ఫైర్ ఎన్‌వోసీలు, ఫుడ్ లైసెన్సులు లేకపోవడం గమనార్హం. అయినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం విశేషం.
ఏకకాలంలో సోదాలు: ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జోన్–1, జోన్–2 పరిధిలో శనివారం తెల్లవారుజాము 5 నుంచి 11 గంటల వరకు ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించారు. 80 బృందాల్లో 270 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో నగరంలో ఉన్న 81 హోటళ్లు/లాడ్జీలు, 5 మెన్ హాస్టళ్లల్లో రికార్డులను సైతం పరిశీలించారు. ప్రధానంగా హోటళ్లలో అతిథుల జాబితాలో ఎవరైనా పరారీలో ఉన్న నిందితుల ఉన్నారా? వీసా గడువు ముగిసినా విదేశీ అతిథుల వివరాలు, మైనర్ జంటలు, అసాంఘిక కార్యకలాపాలు, మద్యం అమ్మకాలపై ఆరా తీశారు. పలు శాఖల అనుమతుల రికార్డులను పరిశీలించారు.
జీఎస్టీలు, ట్రేడ్ లైసెన్సులు లేకుండానే..
ఈ తనిఖీలో పలు శాఖాధికారులు నిర్లక్ష్యం బట్టబయలైంది. అనేక హోటళ్లు తప్పనిసరి అనుమతులు కూడా పొందకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు నిర్ధారణ అయింది. ప్రధానంగా 47 హోటళ్లు, లాడ్జీ లకు అగ్నిమాపక ఎన్‌వోసీలు, 22 హోటళ్లకు జీఎస్టీ సర్టిఫికెట్లు, 8 హోటల్/లాడ్జిలకు ట్రేడ్ లైసెన్సులు, 11 హోటళ్లకు ఫుడ్ లైసెన్సులు లేనట్లు గుర్తించారు. అదే విధంగా 30 హోటళ్లు, లాడ్జీల్లో విజిటర్స్ మానిటరింగ్ సిస్టమ్స్‌లో సందర్శకుల సమాచారాన్ని సక్రమంగా అప్‌డేట్ చేయకపోవడం, 36 హోటళ్లలో తనిఖీలకు ఉపయోగించే డీఎఫ్‌ఎండీ, హెచ్‌హెచ్‌ఎండీ, లగేజీ స్కానర్, అండర్ వెహికల్ చెకింగ్ మిర్రర్ లేకపోవడం, 5 హోటళ్లలో సీసీ కెమెరాలను పర్యవేక్షించడం లేదని గుర్తించారు. నిబంధనలు పాటించని పక్షంలో యాజమాన్యాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment