ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● 29న ఏయూ మైదానంలో బహిరంగ సభ, రోడ్ షో ● వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
మహారాణిపేట: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 29వ తేదీన విశాఖ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కలెక్టరేట్‌లో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ, రోడ్ షో గురించి ఎంపీ ఎం.శ్రీభరత్, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేశ్ బాబు, అధికారులతో చర్చించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వీఐపీల రాక, ప్రధాన మంత్రికి స్వాగతం ఏర్పాట్లు, ప్రజలకు తాగునీరు, ఆహారం, ఇతర వసతుల కల్పన తదితర అంశాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులు సలహాలు, సూచనలు అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్ కుమార్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్, ఆర్డీవోలు పి.శ్రీలేఖ, సంగీత్ మాధుర్, డీసీసీలు, ఇతర రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ప్రధాని పర్యటన ఇలా..
ప్రధాని మోదీ ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 3.40 గంటలకు ప్రత్యేక విమానంలో తూర్పు నౌకాదళానికి చెందిన ఎయిర్‌బేస్ ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాన్వెంట్ జంక్షన్, రైల్వే స్టేషన్, సంపత్ వినాయగర్ టెంపుల్, టైకూన్, సిరిపురం జంక్షన్ మీదుగా ఎస్పీ బంగ్లా రోడ్డు నుంచి వేదిక వద్దకు 4.40 గంటలకు వస్తారు. ఈ క్రమంలో టైకూన్ జంక్షన్ నుంచి ఎస్‌పీ బంగ్లా వరకు రోడ్‌షోలో పాల్గొంటారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఏయూ మైదానంలో బహిరంగ సభకు చేరుకుంటారు. బహిరంగ సభలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులతో కలిసి పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు, రైల్వే లైన్లు, మొదలైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్ని ప్రధాని చేయనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్రసంగాల అనంతరం సాయంత్రం 5.25 నుంచి 5.43 గంటల వరకు ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.45 గంటలకు సభా వేదిక నుంచి ఎయిర్ పోర్టుకు తిరుగుపయనమవుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment