విమానాశ్రయంలో మాక్ డ్రిల్ నేడు
మహారాణిపేట: విశాఖ విమానాశ్రయంలో బుధవారం మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తలెత్తే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్టు విపత్తుల నిర్వహణ సంస్ధ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మంగళవారం విమానాశ్రయంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ముఖ్యపాత్ర పోషించే ఎన్డీఎంఏ, ఎయిర్ పోర్ట్ అథారిటీ, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్, నేవీ, ఫైర్ సర్వీసెస్, పోలీసు, మెడికల్–హెల్త్ , పంచాయతీరాజ్ తదితర శాఖలు ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొంటాయన్నారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఉంచిన పరికరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్డీఎంఏ మెంబర్, లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్, మేజర్ జనరల్ ఏకే వర్మ, విశాఖ ఎయిర్ పోర్టు అథారిటీ డైరెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment