● కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లు ● 11న నామినేషన్ల పరిశీలన
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. కలెక్టర్ కార్యాలయంలోనే ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ప్రభుత్వ పని వేళల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్లు దాఖలు చేయొచ్చు. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 13న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3న కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల్లో పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.5 వేలు ధరావత్తు చెల్లించాలి. ఉచితంగా ఇచ్చే దరఖాస్తులను ఇప్పటి వరకు 8 మంది తీసుకున్నారు. 4న మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, 6న పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరి, 7న పాకలపాటి రఘువర్మ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
123 పోలింగ్ కేంద్రాలు : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తుది ఓటర్లు జాబితా మేరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 21,555 మంది ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ 30న ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. చివరి తేదీ అయిన జనవరి 31 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో 1,300 దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలన జరుగుతోంది. ఆరు జిల్లాల పరిధిలో పురుష ఓటర్లు 12,948, మహిళా ఓటర్లు 8,607 మంది ఉన్నారు. ఉత్తరాంధ్ర పరిధిలో 123 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. విశాఖలో 13, అనకాపల్లిలో 24, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11, విజయనగరంలో 29, పార్వతీపురం మన్యంలో 15, శ్రీకాకుళంలో 31 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్ట అమలుకు 23 బృందాలను నియమించారు. వివిధ స్థాయి అధికారులతో కూడిన 12 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు(ఎంసీసీ) బృందాలు, 11 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. వీరు కాకుండా జీవీఎంసీ అదనపు కమిషనర్, జెడ్పీ సీఈవో, భీమిలి, విశాఖ ఆర్డీవోలను నోడల్ అధికారులుగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment