సీజనల్‌ వ్యాధులపై జరభద్రం.. | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులపై జరభద్రం..

Published Sat, May 25 2024 2:45 PM

సీజనల

విజయనగరం ఫోర్ట్‌: సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి ప్రారంభమైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు వ్యాధుల బారిన పడ్డారు. వైరల్‌ జ్వరాలు, మలేరియా, డెంగీ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. వైరల్‌ జ్వర పీడితులైతే వేలల్లో ఉండడంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ వ్యాధి నిర్ధారణ మాత్రం విజయనగరంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, రాజం ఏరియా ఆస్పత్రుల్లో చేస్తున్నారు. వేసవి కాలం ముగియనున్న సమయంలో వ్యాధుల వ్యాప్తి అధికమయ్యే అవకాశం ఉంది. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ అధికారులు ముందుస్తు నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రజలు కూడా వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

67, 344 జ్వరాల కేసులు..

జిల్లాలో జనవరి నెల నుంచి మార్చి నెలఖారు నాటికి 67, 344 జ్వరాల కేసులు నమోదయ్యాయి. 820 మందికి డెంగీ పరీక్షలు నిర్వహించగా అందులో 41 మందికి డెంగీ నిర్ధారణ అయింది. 67, 344 మందికి మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 120 మలేరియా పాజిటివ్‌ వచ్చింది.

మలేరియా..

తీవ్రమైన తలనొప్పి, వణుకుతో కూడిన అధిక జ్వరం మలేరియా లక్షణాలు. మలేరియా జ్వరం తగ్గిన తర్వాత మళ్లీ వస్తుంది. జ్వరం తగ్గిపోయిన తర్వాత మళ్లి వచ్చినట్టు అయితే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. మలేరియా వ్యాధి ఆడ అనాఫిలిస్‌ దోమ కాటు వల్ల వస్తుంది. దోమ కాటు వల్ల దాని లోపల ఉన్న మలేరియా జెరమ్స్‌ శరీరంలోకి వెళ్తాయి. 14 రోజుల తర్వాత అధిక జ్వరం వస్తుంది. ఈ దోమ నిల్వ ఉన్న వర్షపు నీటిలో వృద్ధి చెందుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

మలేరియా నివారించడానికి దోమ తెరలు వినియోగించుకోవాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే కిరోసిన్‌ గాని పురుగు మందుగాని పిచికారీ చేయాలి.

డెంగీ..

జ్వరంతో పాటు తీవ్ర తలనొప్పి, ఒళ్లు నొప్పులుంటాయి. ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం కలగడం వల్ల కాళ్లు, చేతులు, ముఖం, వీపు, ఉదర భాగాల చర్మంపై ఎర్రగా కందినట్టు చిన్న చిన్న మొటిమలు కనిపిస్తాయి. ఒక్కోసారి ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా మారుతుంది. ఈడిస్‌ ఈజిప్టు అనే దోమ కాటు వల్ల డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఈ దోమ పగటి పూట కుడుతుంది. దోమ కుట్టినప్పడు ఒళ్లుంతా దద్దర్లు కనిపిస్తాయి. ఇళ్లల్లోని కుండీలు, ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లు, ఎయిర్‌ కూలర్లు, ఇళ్ల పరిసరాల్లో నిర్లక్ష్యంగా పడేసిన కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్‌ కుప్పలు, పగిలిన సీసాలు, టైర్లు వంటి వాటిల్లో చేరిన వర్షపు నీటిలో గుడ్లు పెట్టి దోమ పెరుగుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఇంటి పరసర ప్రాంతాల్లో వృథా నీటిని నిల్వ ఉంచరాదు. పెంట కుప్పలు, ఇంట్లో వచ్చే చెత్తాచెదారం ఇంటికి దూరంగా వేయాలి. ఇళ్లలో ఉన్న అన్ని గదుల్లో దోమల మందు పిచికారీ చేయించాలి. దోమ తెరలు వాడటం లేదా ఇంటి కిటికీలు, తలుపులకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. నీరు నిల్వ చేసే పాత్రలను వారానికి ఒకసారి ఖాళీ చేసి మరలా నింపు కోవాలి.

ప్రారంభమైన వ్యాధుల వ్యాప్తి

67,344 జ్వరాల కేసులు నమోదు

120 మలేరియా కేసులు, 41 డెంగీ కేసులు కూడా..

అప్రమత్తంగా ఉన్నాం..

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం. వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. జ్వర పీడితుల వద్ద శాంపిల్స్‌ తీసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం.

ఎస్‌. భాస్కరరావు, డీఎంహెచ్‌ఓ

సీజనల్‌ వ్యాధులపై జరభద్రం..
1/1

సీజనల్‌ వ్యాధులపై జరభద్రం..

Advertisement
 
Advertisement
 
Advertisement