ఓట్ల లెక్కింపులో ఏజెంట్లే కీలకం | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపులో ఏజెంట్లే కీలకం

Published Sun, May 26 2024 4:55 AM

ఓట్ల లెక్కింపులో ఏజెంట్లే కీలకం

కట్టుదిట్టమైన భద్రత

● ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఈవీఎంల రవాణాకు బారికేడ్‌లు ఏర్పాటు ఉంటుంది.

● రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు, ఎలక్షన్‌ ఏజెంట్లను లెక్కింపు కేంద్రంలోనికి అనుమతిస్తారు.

● మూడంచెల భద్రతలో భాగంగా మొదటిగా 100 మీటర్ల పాదచారుల జోన్‌ ఉంటుంది. ఇందులో సంబంధిత వ్యక్తి గుర్తింపు కార్డును సీనియర్‌ మేజిస్ట్రేట్‌ పరిశీలించి అనుమతిస్తారు.

● రెండో అంచెలో ఆయా వ్యక్తులను రాష్ట్రసాయుధ పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు, మొబైల్‌ ఫోన్‌లు లేవని నిర్ధారించుకున్న తరువాత విడిచి పెడతారు. ఇక్కడ మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.

● మూడో అంచెలో కేంద్ర సాయుధ బలగాలు తనిఖీ చేస్తాయి. కౌంటింగ్‌ హాలు లోపలకు కెమెరా స్టాండ్‌ను అనుమతించరు. చేతి కెమెరాకు మాత్రమే అనుమతి ఉంటుంది. శాంతిభద్రతల విషయంలో కచ్చితత్వం పాటించాలి.

● ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకూ మొత్తం బాధ్యత రిటర్నింగ్‌ అధికారిపైనే ఉంటుంది.

విజయనగరం అర్బన్‌: జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఏర్పాట్లు చకచకా పూర్తిచేస్తోంది. లెక్కింపు ప్రక్రియపై 1,043 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. ఎన్నికల నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించింది. కౌంటింగ్‌కు అభ్యర్థుల తరఫున హాజరయ్యే ఏజెంట్లకు లెక్కింపు ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన అవసరమని, అప్పుడే లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు.

నిబంధనలు ఇలా..

● కౌంటింగ్‌ సిబ్బందిని తప్ప ఇతరులెవ్వరినీ ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతంలోకి అనుమతించరు. ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్‌టీయూ జీవీ, లెండి ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణాల్లోకి ఎటువంటి వాహనాలకూ అనుమతి ఉండదు.

● కౌంటింగ్‌ కేంద్రాల్లోనికి రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌ఓ) తప్ప ఇతరుల మొబైల్‌ ఫోన్లను అనుమతించరు.

● ఆర్వోలు తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారా రౌండ్ల వారీ సమచారం ఇవ్వాలి. ఆర్వోలు డిజిగ్నేటెడ్‌ అధికారిని నియమించుకుని వారి ద్వారా మీడియా విభాగానికి సమాచారం చేరవేయాలి.

● కమ్యూనికేషన్‌ విభాగంలోని అధికారులు, సిబ్బందికి సిట్టింగ్‌ ఏర్పాట్లు ఉంటాయి. ఎస్‌టీడీ, ఫ్యాక్స్‌, ప్రింటర్‌, ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉంచుతారు. ప్రధాన ఎన్నికల అధికారికి తక్షణ సమచారం అందించేందుకు హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ కలిగిన కంప్యూటర్‌తో పాటు ఒక హాట్‌ లైన్‌ ఏర్పాటు చేస్తారు.

● ఒక్కో కౌంటింగ్‌ కేంద్రంలో గరిష్టంగా 14 మంది ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు.

● ఫారం 17సీలో నమోదు చేసిన ఓట్లను ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యతో సరి చూస్తారు. ఆ సంఖ్యను కౌంటింగ్‌ సిబ్బంది ఫారం–17సీ పార్ట్‌–2 లో నోట్‌ చేసుకుని ఏజెంట్ల సంతకం తీసుకుంటారు.

● ఆ తర్వాత ఈవీఎంల సీల్‌ తొలగించి రిజల్ట్‌ బటన్‌ నొక్కుతారు. ఆ ఈవీఎంలో పోలైన ఓట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయం తెలుస్తుంది.

● ఆ వివరాలను కౌంటింగ్‌ సిబ్బంది నోట్‌ చేసి, ఆ సంఖ్యను ఏజెంట్లందరికీ చూపించి వారి సంతృప్తి వ్యక్తం చేశాకే రౌండ్‌ ఫలితాలను వెల్లడించాలి.

● ఒక్కో రౌండ్‌లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చా యనే వివరాలను కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన బోర్డుపై సిబ్బంది రాస్తారు. ఈ మొత్తం ప్రక్రియ వీడియో తీసి భద్రపరుస్తారు.

ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు

ఓట్ల లెక్కింపు కోసం జేఎన్‌టీయూ జీవీ, లెండి కళాశాల ప్రాంగణాల్లో కౌంటింగ్‌ సెంటర్ల కోసం ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. పార్లమెంట్‌ కోసం 14, ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల వంతున ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు ఉండి ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది.

పోస్టల్‌ బ్యాలెట్‌ అర్హతలు

పోస్టల్‌ బ్యాలట్‌లను ముందుగా లెక్కిస్తారు. ఒక నియోజకవర్గానికి ఒక ఏఆర్‌ఓ, కౌంటింగ్‌ పరిశీలకుడు, ఇద్దరు కౌంటింగ్‌ సహాయకులు, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి గెజిటెడ్‌ ఆఫీసర్‌ అటెస్టెడ్‌ చేశారా? లేదా, సంతకం, డిక్లరేషన్‌, సీరియల్‌ నంబర్‌, ఓటరు సంతకం, సీరియల్‌ నంబర్‌ మ్యాచ్‌ అవుతుందా లేదా చూసుకొని వ్యాలిడ్‌, ఇన్‌ వ్యాలిడ్‌గా గుర్తిస్తారు. వ్యాలిడ్‌ బ్యాలెట్లను మాత్రమే లెక్కించాల్సి ఉంటుంది.

ఎన్నికల నిబంధనలపై అవగాహన తప్పనిసరి

ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు

ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల ఏర్పాటు

రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటన

Advertisement
 
Advertisement
 
Advertisement