ఇంకెంత మంది చనిపోతే స్పందిస్తారు..? | - | Sakshi
Sakshi News home page

ఇంకెంత మంది చనిపోతే స్పందిస్తారు..?

Published Sun, Oct 20 2024 12:58 AM | Last Updated on Sun, Oct 20 2024 12:58 AM

ఇంకెంత మంది చనిపోతే స్పందిస్తారు..?

విజయనగరం: ప్రభుత్వ వైఫల్యంతోనే ఉమ్మడి విజయనగరం జిల్లాలో డయేరియా సోకి మరణాలు సంభవిస్తున్నాయని, ఇంకెంత మంది చనిపోతే స్పందిస్తారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరలు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కళ్లముందే అన్నదమ్ములు, అక్కచెల్లెల్లు, నాన్నమ్మలు, అమ్మమ్మలు కాటికి వెళ్లిపోతుంటే వారి ఆక్రందనలను ప్రభుత్వం అర్ధం చేసుకోలేదా...? ప్రజల ప్రాణాలంటే అంత చులకనా...? పోయిన ప్రాణాలను తిరిగి తెచ్చి ఇవ్వగలరా...? అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారిందని మండిపడ్డారు. అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లోపాలతో ఉమ్మడి జిల్లాలో మరణాలు సంభవిస్తున్నాయని దుయ్యబట్టారు. తక్షణమే మరణించిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్‌సీపీ నుంచి తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తామని హమీ ఇచ్చారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ చాంబర్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇరువురు నాయకులు మాట్లాడారు. వారి మాటల్లోనే....

ఈ మరణాలకు ప్రభుత్వానిది బాధ్యత కాదా...?

విజయనగరం జిల్లా కేంద్రానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్ల మండల కేంద్రంలో ఈ నెల 14న డయేరియా విజృంభించింది. నాటి నుంచి నేటి వరకు 11 మంది మృత్యువాత పడ్డారు. గ్రామంలో ఉండేందుకు భయపడిన స్థానికులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో లాక్‌ డౌన్‌ పరిస్థితులు తలపిస్తున్నాయి. అధికారయంత్రాంగం 8 మంది మాత్రమే చనిపోయారంటూ ప్రకటనలు చేస్తున్నారు. సాలూరు నియోజకవర్గంలో ఈనెల 3న డయేరియా ప్రబలి పలువురు మరణించారు. ఏజెన్సీవాసులు విషజ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏం చేస్తున్నారు. కనీస మంచి, మానవత్వాలు ఈ ప్రభుత్వానికి లేవా..? అనిపిస్తోంది.

సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి..

డయేరియాతో ఒకే గ్రామంలో 8 మంది చనిపోవడం ఆందోళనకరం. వైద్యసేవలు అందించడంలో విఫలమయ్యారు. ఇది సిగ్గుతో తలిదించుకోవాల్సిన పరిస్థితి. గుర్ల ప్రజలు ఆరోగ్య సమస్యను స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లా మంత్రి, కలెక్టర్‌, వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ పర్యటించినా కనీసం రోగాల బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందించే దిశగా ఆలోచన చేయలేదు. ఇటువంటి పరిస్థితులతో జాతీయ స్థాయిలో వైద్య ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌ చిన్నబోయే స్థితికి దిగజార్చారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వెల్‌నెస్‌ల సెంటర్లు ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సేవలందించడం వల్ల కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల ఆరోగ్యం కాపాడింది. రైలు ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులను నిమిషాల వ్యవధిలో ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడిన సంఘటనలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం నటించడం దారుణం. ఐదు రోజులుగా బడిలో బెంచీలపై డయేరియా రోగులకు వైద్యసేవలందించడం చూస్తే ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కనీసం మానవత్వంలో ఆలోచన చేయడంలేదు.

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఎక్కడ?

ఉమ్మడి విజయనగరం జిల్లాలో డయేరియా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం తీరు ఆక్షేపనీయం. ఎంత మంది చనిపోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వస్తారు?. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం చుట్టం చూపుగా వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారు. గుర్లతో పాటు నాగళ్లవలసలో డయేరియా వ్యాప్తి అధికంగా ఉంది. సంబంధిత మంత్రి స్పందించి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలి.

ఉపాధి నిధుల దోపిడీకి ప్రయత్నం..

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం నిధులను కాంట్రాక్ట్‌ వ్యవస్థ ద్వారా దోపిడీ చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా, సాంకేతికంగా బలంలేని పంచాయతీలకు వెండార్‌ వ్యవస్థ ద్వారా ఆయా గ్రామ పంచాయతీల తీర్మానాలతో పనులు చేపట్టేందుకు జారీచేసిన జీవోను అడ్డంపెట్టుకుని నేడు కూటమి ప్రభుత్వం పల్లె పండగ పేరుతో చేస్తున్న శంకుస్థాపనల పనులను వెండార్‌లకు అప్పగిస్తోంది. వీటికి ఎటువంటి గ్రామ పంచాయతీల తీర్మానాలు లేవు. పనులు అప్పగించిన తరువాత తీర్మానాలు చేయకుంటే జిల్లాలో 95 శాతంకుపైగా ఉన్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారు సర్పంచ్‌ల చెక్‌ పవర్‌లను రద్దుచేస్తామని బెదిరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొరికింది దోచుకో.. దాచుకో పరిస్థితి వచ్చింది. ఉపాధి హమీ చట్టం ప్రకారం పనులు మంజూరు చేసి చేపట్టకుంటే ఆ పనులను అడ్డుకుంటాం. ఈ ప్రక్రియలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులను వదిలేది లేదు. చట్టాలు శాశ్వతమన్న విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలి. ఇదే సందర్బంలో వైఎస్సార్‌సీపీ స్పరంచ్‌లకు పార్టీ అండగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వం నాయకులకు బెదిరింపులకు బెదరవద్దు. సర్పంచ్‌ల హక్కులు, అధికారాలను కాపాడుతాం. సమావేశంలో పార్టీ నాయకులు పీరుబండి జైహింద్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ వైఫల్యంతోనే మరణ మృదంగం

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement