పెదపెంకిలో బోద వ్యాధి ర్యాండమ్ సర్వే
పార్వతీపురం: బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో నవంబర్ 4, 5, 6 తేదీలలో బోదవ్యాధి ర్యాండమ్ సర్వేను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై ఆయన సమీక్షించారు. పెదపెంకి పంచాయతీ పరిధిలో సుమారు 4.80 కిలోమీటర్ల మేర మురుగు కాలువ నిర్మాణానికి రూ.3.75 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నెలలో కనీసం 70 గ్రామ సచివాలయాల పరిధిలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. భామిని, బత్తిలి పీహెచ్‌సీల పరిఽధిలో టీబీ తనిఖీలు మెరుగుపడాలన్నారు. గ్రామ స్థాయిలో రక్తహీనత నివారణకు కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. వసతిగృహలలో రక్తహీనత గమనిస్తే సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. జిల్లాకు కొత్త అంబులెన్స్‌లు రానున్నాయన్నారు.
కేన్సర్ స్క్రీనింగ్
ఏఎన్‌ఎం,ఎంఎల్‌పీహెచ్ ఇద్దరూ ఇంటింటి సర్వేను చేపట్టి కేన్సర్ కేసులను గుర్తించాలన్నారు. సర్వైవికల్ కేన్సర్, ఓరల్ కేన్సర్‌లను గూర్చి వివరించడంతో పాటు ఇతర వ్యాధుల పట్ల కూడా అవగాహన కల్పించాలన్నారు.
కృత్రిమ పరికరాలకు స్క్రీనింగ్
నవంబర్ 19 నుంచి అలిమ్ కోసంస్థ కృత్రిమ పరికరాల కోసం స్క్రీనింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. నవంబర్ 19న సాలూరులో, 21న పాలకొండ, 23న పార్వతీపురంలోను స్క్రీనింగ్ శిబిరాలను నిర్వహిస్తారన్నారు. ఈ సందర్భంగా బాల్యవివాహల నివారణపై నీడ్ సంస్థ రూపొందించిన పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ కె.విజయపార్వతి, ఆస్పత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment