రోడ్డెక్కిన విద్యార్థులు
విజయనగరం రూరల్: విద్యా సంవత్సరం ఆరంభమై ఆరునెలలు కావస్తున్నా కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంపై విద్యార్థులు మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన గళం వినిపించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాము మాట్లాడుతూ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చిన్నపాటి వర్షానికే బీపీఎం పాఠశాల మైదానం చెరువును తలపిస్తోందన్నారు. కంటోన్మెంట్, కస్పా, వీటీ అగ్రహారం, దాసన్నపేట, రింగ్‌రోడ్డు ప్రాంతాల్లోని పలు పాఠశాలల్లో మరుగుదొడ్లకు తాళాలు వేయడం తగదన్నారు. కొన్ని పాఠశాలల్లో మెనూ గోడలకే పరిమితమవుతోందన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
నాయకుల అరెస్టు
శాంతియుతంగా విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు జులుం ప్రదర్శించడాన్ని విద్యార్థి సంఘాల నాయకులు తప్పుబట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డి.రాము, జె.రవికుమార్, పట్టణ నాయకులు గుణ, వాసును ఒకటో పట్టణ పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడంపై నిరసన తెలిపారు.
6న చలో కలెక్టరేట్
వచ్చేనెల 6వ తేదీన జిల్లా అంతటా ఉన్న విద్యాలయాల్లో సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న చలో కలెక్టరేట్‌ను విద్యార్థులు విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భారతి, రాహుల్, ఎర్రమ్మ, మురళీ, శిరీష, చిరు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment