పాఠశాల నుంచే ఉపాధి విద్య
● పీఎంశ్రీ పాఠశాలల్లో
వృత్తివిద్యా కోర్సులు అమలు
● 9,10 తరగతి విద్యార్థులకు
రెగ్యులర్ విద్యతో పాటు ప్రత్యేక శిక్షణ
● నైపుణ్య సాధనకు క్షేత్రస్థాయి పరిశీలన
’విద్యార్థులకు ఎంతో మేలు..
వృత్తి విద్యాకోర్సులతో ఎంతో మేలు జరుగుతుంది. ఉన్నత అధికారుల సూచనలకు ఆనుగుణంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో వృత్తి విద్యను పకడ్బందీగా అమలు చేస్తూ విద్యార్థులను క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకు వెళ్లేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. స్కూళ్లను తరచూ సందర్శించి విద్యార్థుల ప్రగతిపై సమీక్షిస్తున్నాం.
– ఎన్.తిరుపతినాయుడు, డీఈఓ,
పార్వతీపురం మన్యం జిల్లా
పార్వతీపురం: జాతీయ విద్యావిధానంలో భాగంగా సరికొత్త చదువులు అందుబాటులోకి వస్తున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రాయోజిత కార్యక్రమాలతో పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంపిక చేసిన 19 పాఠశాలల్లో వృత్తి విద్యాబోధన సాగుతోంది. వాటిలో రెండు ప్రాథమిక పాఠశాలలు, 17 ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పథకం ఐదు సంవత్సరాల వ్యవధిలో 2022–23నుంచి 2026–27 వరకు అమలవుతుంది. ఈ పథకానికి అవసరమైన నిధులను కేంద్రప్రభుత్వం అందజేస్తుంది. మంజూరైన నిధులతో పాఠశాలలో ప్రయోగశాలలు, విద్యార్థులకు అవసరమైన సాంకేతిక సాధనాలు సమకూర్చుకోవడం, డిజిటల్ పద్ధతిలో బోధన తదితర సౌకర్యాలను కల్పించుకోవచ్చు. ఇందుకు అవసరమైన శిక్షణను ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు అందజేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేదవిద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించేందుకు 2023–24 విద్యా సంవత్సరంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలోనే బలమైన పునాదులు పడ్డాయి.
’అమలవుతున్న కోర్సులివే..
అగ్రికల్చర్, ఆటోమోటివ్ ఐటీ–ఐటీఈ, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ అండ్ వెల్‌నెస్, రిటైల్, జీఎఫ్‌ఎస్‌ఐ. హెల్తేకేర్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర వృత్తి విద్యాకోర్సులు అమలవుతున్నాయి. వాటిలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకే కల్పిస్తున్నారు. పాఠశాలలో ప్రతిరోజూ ఒక పీరియడ్, ప్లస్‌టూలో వారంలో తప్పనిసరిగా మూడు పీరియడ్లు వృత్తి విద్యా కోర్సులు బోదించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. మరో మూడు పీరియడ్లు ప్రాక్టికల్స్ నిర్వహిస్తూ విద్యార్థులు ఆయా కోర్సుల్లో ప్రావీణ్యం పొందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
పీఎంశ్రీ పాఠశాలలో ప్రయోగాలు..
పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు దూసుకువెళ్లేలా కేంద్ర ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది. పీఎంశ్రీ పథకం కింద 14 పాఠశాలలకు క్రీడా మైదానాలు, ఐదు పాఠశాలలకు అటల్ టింకరింగ్ ల్యాబ్‌లకు నిధులు మంజూరయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment